మల్లాపూర్, జనవరి 24: పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ మాజీ సర్పంచ్ గ్రామ సభ సాక్షిగా ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్యకు యత్నించాడు. శుక్రవారం మొగిలిపేటలో తహసీల్దార్ వీర్‌సింగ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. అధికారులు అర్హుల జాబితా చదివి వినిపించగా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, ఆత్మీయ భరోసా పథకాలకు అనర్హులను ఎంపిక చేశారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సర్కార్ ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని, ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ సర్పంచ్ వనతడపుల నాగరాజు ధ్వజమెత్తాడు. ఆ పార్టీ నేతలు సూచించిన వారి పేర్లే సంక్షేమ పథకాల జాబితాలో వచ్చాయని ఆరోపించాడు. గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన సుమారు 18లక్షల పెండింగ్ బిల్లులను ఏడాది గడిచినా చెల్లించడం లేదని మండిపడ్డాడు. మాజీ సర్పంచులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ సర్కార్‌ది ప్రజాపాలన కాదు, రాక్షస పాలనని ఆగ్రహించాడు. అనంతరం జీపీ కార్యాలయం ద్వారం వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మాజీ సర్పంచ్‌ను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీస్ వాహనంలో స్టేషన్‌కు తరలించారు.
విషయం తెలిసిన వెంటనే కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల మల్లాపూర్‌కు చేరుకొని మాజీ సర్పంచ్ నాగరాజును పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులకు ఉన్న పోరాట పటిమ ఎవరికీ ఉండదని.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమగళం వినిపించాలని సూచించారు. అనంతరం ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. మాజీ సర్పంచ్ నాగరాజు గ్రామ సభలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరమని పోస్ట్ చేశారు.