పెద్దపల్లి, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ప్రజా చైతన్యమే మన ఆయుధమని, ఆ దిశగా ప్రతి కార్యకర్తా పోరాడాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి, అసత్య ప్రచారం చేసి, అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆ పార్టీ చేసిన మోసాలను ఎండగట్టాలని, కేసీఆర్ సర్కారు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటింటా వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఎంపీ ఎన్నికల్లో ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ రెడ్డి ఫంక్షన్హాల్లో సోమవారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పెద్దపల్లి నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించారు.
కేసీఆర్ తెలంగాణను సాధించి, దేశమే ఆశ్చర్యపోయేలా పదేళ్ల పాటు పరిపాలించారన్నారు. అలాంటిది గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలు కావడం కొంత బాధ కలిగిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, ఇంత భారీ మోసం చేస్తుందని ఎవరూ ఊహించలేదన్నారు. ఈ సందర్భంగా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లికి చెందిన భస్వపత్రి సంతోశ్ ప్రమాదవశాత్తూ మరణించగా వారి కుటుంబానికి 2లక్షల బీమా చెక్కును నిరంజన్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్ ఎంపీపీలు, ఎంపీపీ బాలాజీ రావు, రేణుక, నూనేటి సంపత్, జడ్పీటీసీ గంటా రాములు, నాయకులు నల్లా మనోహర్‌రెడ్డి, ఉప్పు రాజ్‌కుమార్, జడల సురేందర్, కొయ్యడ సతీశ్ ఉన్నారు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి అది మరిచి సంస్కార హీనంగా మాట్లడుతున్నడు. మహనీయుడు కేసీఆర్‌పై విమర్శలు చేయడం సిగ్గు చేటు. ఎన్నికల ఇష్టారాజ్యంగా హామీలు ఇచ్చి, ఇప్పుడు నెరవేర్చే సత్తా లేక రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పడం సరికాదు. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాల విషయంలో విభజన సమయంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే కదా.. విభజన చట్టం పరిధిలో చేర్చింది కాంగ్రెస్ సన్నాసులు కాదా..? కాంగ్రెస్ అధికారంలో ఉంటే యావత్ తెలంగాణానే ఆంధ్రాకు అప్పగించే ప్రమాదం ఉంది.
– నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పదేండ్ల పాటు కష్టపడి పనిచేసినం. ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేసినం. ప్రతి కుటుంబానికీ సంక్షేమాన్ని అందించినం. కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని ఆ పార్టీ 50 రోజుల పాలనతోనే తేలిపోయింది. ప్రజలు, రైతులు ఆవేదనతో ఉన్నారు. వారికి ప్రతి కార్యకర్తా అండగా నిలువాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టద్దు. ఏ పార్టీ అభివృద్ధి, సంక్షేమం అందిస్తుందో ప్రజలకు చెప్పాలి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు వేధింపులు, సాధింపులు ఉంటయ్. వాటన్నింటినీ సమష్టిగా ఎదుర్కొందాం. మీకు అండగా మేముంటం.
– కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి
రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మలిచిన నాయకుడు కేసీఆర్ అయితే, అధికార మధంతో మాట్లాడుతున్న వ్యక్తి రేవంత్‌రెడ్డి. ముఖ్యమంత్రి పీఠమైన కనకపు సింహాసనంపై శునకమై కూర్చున్నడు. ఆయన రాష్ట్రం గురించి కాకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచిస్తున్నడు. ఈ గుంపు మేస్త్రీ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండేది కాదు. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న పది మంది సీఎం స్థాయి వ్యక్తులు ఈ గుంపు మేస్త్రీని దించేందుకు చూస్తున్నరు. తుమ్మితే ఊడిపోయే ముక్కు కాంగ్రెస్ సర్కార్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టాలి. కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పేలా పనిచేయాలి. ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలి.
– బాల్క సుమన్, మాజీ ఎంపీ
వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేద్దాం. పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల నుంచి భారీ మెజార్టీని సాధిద్దాం. కేసీఆర్ సర్కారు చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని గడపగడపకూ వెళ్లి వివరిద్దాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధాలను నమ్మి మోసపోయామని ప్రజలు గుర్తించిన్రు. ఆ మోసాలకు ఓటు ద్వారానే బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన్రు.
– కోరుకంటి చందర్, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ అభివృద్ధి జరిగింది. ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త గుర్తించి ఇంటింటికీ వివరించాలి. ఈ యాభై రోజుల్లో కాంగ్రెస్ చేసిన ఒక్క పని కూడా లేదు. ఇప్పటి వరకు వాళ్లు చేసిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అన్నీ బీఆర్ఎస్ సర్కార్ చేపట్టినవే. ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించలేదు. కేవలం మాయమాటలు చెప్పే అధికారంలోకి వచ్చిన్రు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలి. బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలి.
– దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే