సిరిసిల్ల టౌన్, నవంబర్ 11: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన మాట నిలుపుకొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అనాథలైన వారి ముగ్గురు పిల్లలకు చేయూతనందించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేటకు చెందిన నేత కార్మిక దంపతులు బైరి అమర్-స్రవంతి ఆర్థిక ఇబ్బందులతో శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకోగా, బాధిత కుటుంబ సభ్యులను కేటీఆర్ ఆదివారం పరామర్శించారు. తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైన ముగ్గురు చిన్నారులకు అధైర్యపడవద్దని, ఏ ఆపదొచ్చినా అండగా నిలుస్తానని భరోసానిచ్చారు. 2లక్షలు చొప్పున పార్టీ ఫండ్‌ను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీనిచ్చారు. ఆయన హామీ ఇచ్చినట్టుగానే సోమవారం ముగ్గురు చిన్నారుల పేరిట 2లక్షల చొప్పున పార్టీ ఫండ్‌ను ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు.
బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో నాయకులు అమర్ నివాసానికి వెళ్లి సంబంధిత ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను చిన్నారులకు అందజేశారు. అనంతరం చక్రపాణి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆర్డర్లు లేక నేతన్నలు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో ఆకలిచావులకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేత కార్మిక కుటుంబానికి చెందిన దంపతుల ఆత్మహత్య ఘటన బాధాకరమన్నారు. ఇలాంటి ఆత్మహత్యలు పునరావృతం కాకుండా సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వాలని, పెండింగ్‌లో పెట్టిన వస్త్ర పరిశ్రమ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నేత కార్మికులు తమ పిల్లల్ని చూసైనా ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన మాట ప్రకారం చిన్నారులకు అండగా నిలిచిన రామన్నకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ బైరి నరేశ్ మాట్లాడుతూ, నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వం వారికి ఉపాధి చూపాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ దిడ్డి మాధవి, అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, గుండ్లపల్లి పూర్ణచందర్, దిడ్డి రాజు, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.