జగిత్యాల/ జగిత్యాలరూరల్, జూలై 26 : ప్రసుత్తం వాతావరణ పరిస్థితులు బాగా లేవని, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి సూచించారు. ఇటీవల జగిత్యాల రూరల్ మండలం పొరండ్లలో విషజ్వరాలతో ఇద్దరు చిన్నారులు మరణించగా, అదే గ్రామానికి చెందిన పలువురు జ్వరాలతో బాధపడుతూ జగిత్యాల మాతా శిశు కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. వీరిని ఆదివారం జీవన్‌రెడ్డి పరామర్శించారు.
కుటుంబసభ్యులతో మాట్లాడారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం పొరండ్లలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. నీటి శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించామని, దాదాపు 20 మంది చిన్నారులు గ్రామంలో విషజ్వరాలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గ్రామంలో శానిటేషన్ ప్రధానం అని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. దవాఖానలో చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. స్కూల్లో మిగతా పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. మరణించిన చిన్నారులకు కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, శ్రీనివాస్ రెడ్డి, గంగారెడ్డి, రాధకిషన్, సతీశ్, రాము, విష్ణు పాల్గొన్నారు.