కార్పొరేషన్, డిసెంబర్ 19 : ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఓటరు జాబితా తప్పుల తడకగా మారిందని రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్ ఆరోపించారు. ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘వన్ ఆధార్.. వన్ ఓటు’ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఓటు నమోదును ఆన్లైన్లో పరిశీలిస్తే ఒక్కరికే నాలుగు నుంచి ఎనిమిది వరకు ఓట్లు కనిపించాయని ఆరోపించారు.
పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో వేల సంఖ్యలో ఓట్లు ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. ఒకే ఆధార్ నంబర్‌పై అనేక ఓట్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వీటన్నింటితో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వీటిపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటరు లిస్టు ప్రకటనకు ముందే ఒకే ఆధార్ నంబర్‌తో నమోదైన ఎక్కువ ఓట్లను గుర్తించి, తొలగించాలని డిమాండ్ చేశారు. ఒక ఆధార్‌తో ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఎలా ఎన్రోల్మెంట్ అయ్యాయో అర్థం కావడం లేదన్నారు.
కొందరు కుట్ర పూరితంగానే అప్లయి చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ‘ఓకే దేశం.. ఒకే ఎన్నికలు’ అనే నినాదంతో దేశం ముందుకు పోతుంటే.. మరి ‘ఒకే ఆధార్.. ఒకే ఓటు’ ఎందుకు తీసుకోవడం లేదన్నారు. ఎన్నికల అధికారులు ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకొని ఓటరు జాబితా పరిశీలన చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పొన్నం అనిల్ గౌడ్, పెండ్యాల మహేశ్‌కుమార్, గుంజపడుగు హరిప్రసాద్, కెమసారం తిరుపతి, కొమురయ్య, పరశురాం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.