నిన్నామొన్నటివరకు పీడీఎస్ దొడ్డు బియ్యంతో దందా సాగించి, వందల కోట్లు సంపాదించిన కొంత మంది మిల్లర్లు.. ఇప్పుడు సన్నబియ్యాన్ని సైతం వదలడం లేదు. అడ్డదారిలో కోట్లు దండుకోవడానికి రుచి మరిగిన అక్రమార్కులు.. పీడీఎస్ సన్నబియ్యంతో మరింత పెద్ద మొత్తంలో సంపాదించేందుకు పావులు కదుపుతున్నట్టు వెలుగులోకి వస్తున్నది. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు చేసిన దాడుల్లో జగిత్యాలలో దాదాపు 800 క్వింటాళ్ల సన్నబియ్యం పట్టుబడడం దందాను బయటపెడుతున్నది.
ఈ అక్రమ వ్యవహారాన్ని బయటకు తెచ్చిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి అన్ని రకాలుగా సహకారం అందించాల్సిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ముడుపులకు అలవాటు పడి చోద్యం చూస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారుల తీరుతోనే అక్రమార్కులు బియ్యం రీసైక్లింగ్ దందాను యథేచ్ఛగా నడుపుతున్నట్టు తెలుస్తుండగా, నిజాయతీగా ఉన్న రైస్‌మిల్లర్లకు చెడ్డ పేరు వస్తుందన్న చర్చ ప్రస్తుతం ఆ వర్గాల్లోనే నడుస్తున్నది. రేషన్‌బియ్యం పట్టుబడిన ఘటనలో జిల్లాకు చెందిన కొంత మంది అధికారుల తీరు అనుమానాలకు తావిస్తుండగా, సదరు అధికారుల వ్యవహారశైలిపై టాస్క్‌ఫోర్స్ అధికారులు ఏకంగా కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తున్నది.
కరీంనగర్, జూన్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జగిత్యాల సమీపంలోని హన్మాన్ సాయి రైస్‌మిల్లులపై రాష్ట్ర పౌరసఫరాల శాఖ అధికారులు నిఘా వేసి తాజాగా దాడులు చేసిన విషయం తెలిసిందే! ఈ నెల 24 తెల్లవారుజామునే ఆ మిల్లుకు వచ్చిన రేషన్ సన్నబియ్యం పట్టుకున్న విషయం విదితమే! అయితే 800 క్వింటాళ్ల వరకు పట్టుకోవడం, 6ఏ కింద మిల్లు యజమాని కొండా లక్ష్మణ్‌పై కేసు నమోదు చేయడం దందాను బయటపెట్టింది.
అయితే రేషన్ సన్నబియ్యం బాగోతం వెలుగులోకి రావడం ఉమ్మడి జిల్లాలో ఇదే తొలిసారని తెలుస్తున్నది. గతంలో దొడ్డురకం రేషన్ బియ్యంతో రీసైక్లింగ్ దందాను ప్రతి జిల్లాలోనూ కొంత మంది రైస్‌మిల్లర్లు నడుపుతూ వచ్చారు. పీడీఎస్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి, సొమ్ము చేసుకున్న వారు ఉన్నారు. ప్రధానంగా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో దందా నడుపుతున్న కొంత మంది మిల్లర్ల వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వస్తున్నదన్న విమర్శలు రైస్‌మిల్ ఇండస్ట్రీలో వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నరకం రేషన్ బియ్యంతోనూ ఇదే దందా మరింత పెద్ద మొత్తంలో నడిపేందుకు ప్రయత్నాలు పెట్టినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే సన్నబియ్యంతో దందా మొదలైందన్న వార్తలు రాష్ట్రంలో అక్కడక్కడ వినిపిస్తుండగా, జగిత్యాల జిల్లాకు చెందిన ఓ మిల్లు యజమాని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టిస్తున్నది. ఈ మిల్లుకు చెందిన వ్యక్తులు చాలాకాలంగా ఇదే వ్యవహారం సాగిస్తున్నారని, కొత్తగా సన్నబియ్యంతో రేషన్ దందా మొదలు పెట్టారంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు వెళ్లినట్టు తెలుస్తున్నది. ఆ మేరకు కమిషనర్ ఆదేశాలతో పక్కగా నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్ అధికారులు హన్మాన్ సాయి మిల్లుపై దాడి చేయడంతో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయట పడ్డాయి.
స్థానిక అధికారుల ఉదాసీనత
నిజానికి నిజాయితీగా మిల్లులు నడుపుతున్న రైస్‌మిల్లుల యజమానులకు అండగా నిలువాల్సిన సంబంధిత శాఖల అధికారులు అక్రమాలకు పాల్పడే మిల్లర్లకు వంత పాడుతున్నారన్న చర్చ ప్రస్తుతం రైస్‌మిల్ ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తున్నది. కొంతకాలంగా బయట పడుతున్న అనేక అంశాలే సాక్ష్యమంటున్నారు రైస్‌మిల్లర్లు! ఒక మిల్లు యజమాని ఒకసారి తప్పు చేస్తే అతడిపై శిక్షలు వేయడంతోపాటు సదరు రైస్‌మిల్లుల వ్యాపారా లావాదేవీలపై కన్నేసి ఉంచాల్సిన అధికారులు, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నది బహిరంగానే కనిపిస్తన్నది.
అక్రమ దందాలు, బియ్యం రీసైక్లింగ్ చేసే రైస్‌మిల్లర్లు ఇచ్చే మామూళ్లకు కక్కుర్తి పడి, వారికే వంతపాడుతున్నారని స్వయంగా రైస్ మిల్లర్లే చర్చించుకుంటున్నారు. ఇటు రాజకీయ నాయకుల అండదండలు, అటు అధికారుల సహకారాలతో తమ దందాను నిరాటకంగా నడుపుతున్నారు. జగిత్యాల జిల్లాలో సన్నరకానికి చెందిన రేషన్ బియ్యం దొరికిన మిల్లు యజమాని విషయంలోనూ అదే జరుగుతున్నదని చెబుతున్నారు. సదరు మిల్లరుపై 20 ఏండ్ల వ్యవధిలో పలు కేసులు నమోదు అయ్యాయని, పీడీ కేసు సైతం అతడిపై నమోదైందని, అలాంటి వ్యక్తిపై, ఆయన మిల్లులపై దృష్టి పెట్టాల్సిన అధికారులు.. అతడితోనే అంటకాగుతున్నారని ఆరోపిస్తున్నారు.
తాజా టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్న రేషన్ బియ్యం వ్యవహారంలోనూ అధికారులు అనుసరించిన తీరు కూడా దీనికి సాక్ష్యంగా నిలుస్తుందనే చర్చ ప్రస్తుతం మిల్లర్లలో సాగుతున్నది. ఈ నెల 23న తెల్లవారుజామున అక్రమ రేషన్‌బియ్యాన్ని పట్టుకున్న సదరు టాస్క్‌ఫోర్స్ అధికారులు.. పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లయి విభాగాలతోపాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తున్నది. నిజానికి ఈ సమాచారం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది.
సన్నబియ్యం ఇస్తున్న క్రమంలో ఈ తరహా దందా వెలుగులోకి రావడాన్ని స్థానిక అధికారులు అత్యంత కీలకమైన అంశంగా భావించి చర్యలు తీసుకోవాలి కానీ, అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ అధికారులు సమాచారం ఇచ్చినా సంబంధిత శాఖ అధికారులు, ఉద్యోగులు పెద్దగా పట్టించుకోలేదని, మొక్కుబడిగా పోలీస్ శాఖ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లను మిల్లు వద్దకు పంపి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దాదాపు 800 క్వింటాళ్ల సన్నబియ్యం పట్టుకున్న మిల్లు వైపునకు మంగళవారం ఏ ఒక్క ఉన్నతాధికారి వెల్లలేదు.
రెవెన్యూ, జిల్లా సివిల్‌సైప్లె అధికారుల తీరు కూడా అదే విధంగా ఉందని తెలుస్తున్నది. దీంతో సదరు బియ్యాన్ని లెక్కించడానికి టాస్క్‌ఫోర్స్ అధికారులు ఓ రోజంతా ప్రయాస పడినట్టు సమాచారం. నిజానికి సన్నబియ్యం రేషన్ దందా తొలిసారిగా వెలుగులోకి వచ్చిన అంశంపై సీరియస్‌గా స్పందించాల్సిన ఆయా విభాగాల అధికారులు రోజంతా వ్యవహరించిన తీరు, చూపించిన నిర్లక్ష్యంపై దాడులు చేసిన టాస్క్‌ఫోర్స్ అధికారులే నివ్వరపోయినట్టు తెలుస్తున్నది.
దీంతో సదరు అధికారుల వ్యవహార శైలిపై పౌరసఫరాలశాఖ కమిషనర్‌కు టాస్క్‌ఫోర్స్ అధికారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తున్నది. జగిత్యాల జిల్లాలో చక్రం తిప్పుతున్న ఓ మిల్లు యజమానికి పౌరసరఫరాలశాఖతో సంబంధం ఉండే ఒక ఉన్నతాధికారి.. ఎలా సహకరిస్తున్నారో కూడా కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో రాసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. సదరు ఉన్నతాధికారి క్షేత్రస్థాయి అధికారులకు హుకూం జారీచేసి, టాస్క్‌ఫోర్స్ అధికారులకు ఏ విధంగానూ సహకరించకుండా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మార్చేందుకు ప్రయత్నాలు
సాక్షాత్తూ రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా.. ఈ వ్యవహారంలో రికార్డులు తారుమారుచేసేందుకు జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి (పౌరసరఫరాలశాఖతో సంబంధం) విశ్వ ప్రయత్నం చేసినట్టు తెలుస్తున్నది. అందుకోసం తన శక్తియుక్తులను ప్రదర్శిచడంతోపాటు రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ అధికారులను కూడా సహకరించాలని కోరినట్టు సమాచారం. అంతేకాదు, పోలీస్ కేసు వెనువెంటనే నమోదు కాకుండా చూసేందుకు సదరు అధికారి చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు.
అయితే విషయం బాహాటంగా బయటకు పొక్కడంతోపాటు కొంత మంది మిల్లర్లు సైతం సదరు అధికారిచేసిన ప్రయత్నాలను ఎండగట్టడంతో ప్లాన్ బెడిసి కొట్టినట్టు తెలుస్తున్నది. ఉన్నతాధికారి ఒత్తిడికి ఏమాత్రం తలొగ్గని టాస్క్‌ఫోర్స్ అధికారులు.. సదరు అధికారి వ్యవహరించిన తీరుపై కూడా పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇటువంటి దందాలకు సహకరిస్తూ మామూళ్లు పెద్ద మొత్తంలో తీసుకోవడంలో సదరు అధికారిది అందెవేసిన చేయి అని.. అందుకే సదరు అక్రమార్కులను అధికారి ప్రోత్సహిస్తున్నరంటూ చర్చ సాగుతున్నది.
ఈ పరిస్థితుల్లో కలెక్టర్ జోక్యం చేసుకోవాలన్న డిమాండ్ పెరుగుతున్నది. టాస్క్‌ఫోర్స్ అధికారులకు సహకరించకుండా.. ఊదాసీనంగా వ్యవహరించిన అధికారులెవరు? అలాగే కేసులు కాకుండా విశ్వ ప్రయత్నం చేసిన కీలక అధికారి ఎవరు? అనే విషయాలపై కలెక్టర్ ఆరా తీస్తే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్నది. భవిష్యత్‌లో ఇటువంటి పరిణామాలు జరకుండా ఉండాలంటే నిశిత విచారణ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ మిల్లర్ల నుంచి వ్యక్తమవుతున్నది.