Godavarikhani Stadium | కోల్ సిటీ , ఆగస్టు 11: రామేశ్వరం పోయినా.. శనేశ్వరం తప్పలేదు అన్నట్టు ఉంది గోదావరిఖని వాకర్స్ పరిస్థితి. కోతుల బెడద తప్పిందనుకుంటే ఇప్పుడు శునకాల భయం పట్టుకుంది. గోదావరిఖని జవహర్ నగర్ లోని జేఎల్ఎన్ క్రీడా మైదానంలో వీధి కుక్కల స్వైర విహారంతో ఉదయం, సాయంత్రం పూట వాకింగ్ కు వచ్చే వారంతా భయం భయంగా.. అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరోగ్యం కోసం స్టేడియంకు రావడం దేవుడెరుగు.. ఆస్పత్రి పాలు గాకుంటే అదే పదివేలు అనుకొని కొంతమంది ఈ కుక్కల భయానికి స్టేడియానికి రావడమే మానుకుంటున్నారు. ఇక ప్రతీ రోజూ సాయంత్రం వివిధ క్రీడల సాధన చేయడానికి వచ్చే క్రీడాకారులు రన్నింగ్, క్రికెట్, ఫుట్బాల్ శిక్షణ సమయంలో పరుగులు తీస్తుండగా కుక్కలు వారి వెంట పడుతున్నాయని వాపోతున్నారు. గత రెండు రోజులుగా కుక్కల బెడద తీవ్రంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక మహిళలు, యువతులు స్టేడియంలో కుక్కలను చూసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాకింగ్ చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల వ్యవధిలో కొంతమంది చిన్నారులు కుక్కల దాడికి గురైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సింగరేణి, మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెడద తప్పించి వాకర్స్ కు రక్షణ కల్పించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.