రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ): సిరిసిల్లను మరో వస్త్రనగరిగా మార్చాలనే రాష్ట సర్కారు సంకల్పం సిద్ధిస్తున్నది. రెడీమెడ్ ప్రపంచంలో కార్మికక్షేత్రం ఖ్యాతిని ఇనుమడింపజేసేందుకు చేపట్టిన అప్పారెల్ పార్క్ నిర్మాణం స్పీడందుకున్నది. జిల్లా కేంద్రం శివారులోని రెండో బైపాస్‌రోడ్డులో సర్దాపూర్ వద్ద 65 ఎకరాల్లో శరవేగంగా రూపుదిద్దుకుంటున్నది. తొలుత టెక్స్టైల్ దిగ్గజం గోకుల్దాస్ యూనిట్ ఏర్పాటు కాబోతున్నది. 17 కోట్ల పెట్టుబడులతో ముందుకురాగా, షెడ్ల నిర్మాణం పూర్తికాగానే వస్ర్తాల తయారీ చేపట్టబోతున్నది. తాజాగా, టెక్స్‌పోర్ట్ ఇండియా కంపెనీ ఒప్పందం చేసుకోగా, ఈ రెండు కంపెనీల ఆధ్వర్యంలో వేలాది మందికి ఉపాధి లభించనున్నది.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మరో కలికితురాయిగా అపారెల్ పార్కు నిలువబోతున్నది. 170కోట్లు, 65 ఎకరాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ భారీ పరిశ్రమలో 90శాతం మహిళలకే ఉపాధి కల్పించేలా చేనేత జౌళిశాఖ చర్యలు తీసుకుంటున్నది.మంత్రి కేటీఆర్ చొరవతో రూపుదిద్దుకుంటున్న పార్కులో పరిశ్రమలు స్థాపించేందుకు అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి. అందులో భాగంగా రూ.17 కోట్ల పెట్టుబడులతో ప్రముఖ గోకుల్దాస్ కంపెనీ యూనిట్ పెట్టేందుకు ముందుకురాగా, షెడ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే టెక్స్‌పోర్టు ఇండియా కంపెనీ సైతం షెడ్ల నిర్మాణానికి అనుమతులు పొందింది. ఈ రెండు పరిశ్రమలతో గార్మెంట్ పరిశ్రమలో కొత్త శకం ఆరంభమవుతుండగా, వేలాది మందికి ఉపాధి లభించబోతున్నది.
వస్త్ర పరిశ్రమలో వనశకం..
మరమగ్గాలపై చీరలతోపాటు శల్లాలు, సూ టింగ్, షర్టింగ్ వస్ర్తాలు తయారవుతున్నాయి. మరమగ్గా ల పరిశ్రమలో పురుషులకే ఉపాధి లభిస్తుండగా, మహిళలకు పెద్ద ఎత్తున జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో మంత్రి కేటీఆర్.. సిరిసిల్ల శివారులోని సర్దాపూర్ వద్ద రెండో బైపాస్‌రోడ్డులో 65 ఎకరాల్లో అప్పారెల్ పార్కును ఏర్పాటు చేశారు. ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు అవసరాన్ని బట్టి చేనేత జౌళిశాఖ స్థలాన్ని కేటాయించి, షెడ్ల నిర్మాణం చేపట్టి ఇస్తున్నది. కేటీఆర్ చొరవతో అనేక కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన గోకుల్దాస్ కంపె నీ తొలుత ముందుకొచ్చి, పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలో రూ.17 కోట్లతో షెడ్ల నిర్మాణాలను మంత్రి గత జూలై 30న ప్రారంభించగా, పనులు శరవేగంగా సాగుతున్నాయి. 80శాతం పనులు పూర్తి కావచ్చాయి. జనవరిలో నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో ఉత్పత్తులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నది. ఈ యూనిట్ ప్రారంభమైతే వెయ్యి మంది మహిళలకు ఉపాధి దొరకనున్నది.
బ్రాండ్ ఇమేజ్‌గా సిరిసిల్ల…
వస్త్రనగరిగా, బ్రాండ్ ఇమేజ్‌గా సిరిసిల్లకు గుర్తింపు తేవాలన్నదే కేటీఆర్ దృఢ సంకల్పం. అందుకే ఆయన బడా కంపెనీలను తీసుకొస్తున్నారు. లోదుస్తుల నుంచి మొదలు టీషర్టులు, జీన్స్ ప్యాంట్స్ తయారీలో అగ్రగామి సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతానికి గోకుల్దాస్, టెక్స్‌పోర్టు ఇండియా కంపెనీలు తమ పనులు ప్రారంభించగా, మరో పది కంపెనీలు త్వరలో రానున్నట్లు అధికారులు తెలిపారు. నాణ్యమైన వస్త్ర ఉత్పత్తులు తయారు చేసేలా యువతులకు, మ హిళలకు జూకీ మిషన్లపై శిక్షణ ఇస్తున్నారు. టెక్స్టైల్స్ పార్కులో ఏర్పాటు చేసిన జూకీ శిక్షణ కేంద్రంలో ఇప్పటివరకు 2వేల మందికి కుట్టు శిక్షణ ఇచ్చారు. శిక్షణ కాలంలో వారికి స్టయిఫండ్ కూడా ప్రభుత్వం చెల్లిస్తున్నది. మొత్తం పదివేల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి, బ్రాండెడ్ దుస్తులను తయారు చేయాలని మంత్రి ఆదేశాల మేరకు జౌళీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గోకుల్దాస్ కంపెనీలో మొదటగా వెయ్యి మందికి ఉపాధి కల్పించనున్నారు. దశల వారీగా యువతులకు శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా బీడీ కార్మికులు, ఆర్అండ్ఆర్ కాలనీలకు చెందిన మహిళలకు 15వేల మందికి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
పనులు వేగంగా జరుగుతున్నాయి..
అప్పారెల్ పార్కులో పరిశ్రమలు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకొస్తున్నాయి. మంత్రి కేటీఆర్ చొరవతో కంపెనీలకు అన్ని రకాల మౌళిక సౌకర్యాలు కల్పిస్తున్నాం. గోకుల్దాస్ కంపెనీ షెడ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. నూతన సంవత్సరంలో ఉత్పత్తులు ప్రారంభించాలన్నది మంత్రి సంకల్పం. 15వేల మందికి పైగా ఉపాధి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికి రెండు కంపెనీలు ముందుకొచ్చాయి. వీటి ద్వారా 2500 మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జూకీలో ఇప్పటికే 1800 మంది నైపుణ్య శిక్షణ పొందిన వారున్నారు. వీరికి మొదట ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.