కరీంనగర్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు తొండలు కూడా గుడ్లు పెట్టని మెట్ట భూములవి.. పత్తి లేకపోతే బీళ్లుగానే ఉండే నేలలవి.. కానీ, ఇప్పుడు తీరొక్క పంటలతో రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. వినూత్నంగా సాగు చేస్తూ రామడుగు మండల రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా ముందుకు ‘సాగు’తున్నారు. ఉద్యాన పంటలతో మంచి లాభాలు ఎలా పొందవచ్చో ప్రత్యక్షంగా చూపుతున్నారు. మండలంలోని ఒక్కో గ్రామంలో రైతులు ఒక్కో ప్రత్యేక పంట పండిస్తుండగా, ఉద్యాన శాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారు.రామడుగు మండలంలో ఒకప్పుడు కరువు కరాళ నృత్యం చేసింది. పత్తి లేదా కొన్ని నీళ్లుంటే తిండికి సరిపడా వరి తప్ప మరో పంట చూడని నేల ఇది. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత భూగర్భ జలాలు పెరుగుతుండడంతో ఇక్కడి రైతులు వినూత్న పంటలవైపు అడుగులు వేస్తున్నారు. వరి కాకుండా ఇతర పంటలు సాగు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
విభిన్న పంటల రారాజు..
రామగుడు మండలంలోని మరో రైతు లక్ష్మీపూర్‌కు చెందిన రాంచంద్రారెడ్డి మూడేండ్ల క్రితం తన క్షేత్రంలోని 2.5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేశారు. నాటిన ఏడాది నుంచి దిగుబడి వస్తోంది. మొదటి ఏడాది ఆశించిన దిగుబడి రాకున్నా రెండో ఏడాది ఎకరానికి ఐదు టన్నుల చొప్పున 12 టన్నుల దిగుబడి వచ్చింది. హోల్‌సేల్‌గా అమ్మినా ప్రస్తుత మార్కెట్లో ఈ ఫ్రూట్స్ ధర రూ.120 నుంచి రూ.140 వరకు ఉంది. ఈ రెండున్నర ఎకరాల్లో రాంచంద్రారెడ్డి రూ.6 లక్షల దిగుబడిని తీశారు. ఇదొక్కటే కాకుండా ఈ రైతు మరో 8 ఎకరాల్లో మస్క్‌మిలన్ వేశారు. దీని లాభాలు మామూలుగా లేవు. ఏకంగా ఢిల్లీకి వెళ్లి మార్కెటింగ్ చేసుకున్న రాంచంద్రారెడ్డి కేవలం రెండు నెలల కాలంలో రూ.76 లక్షల పంట తీశారు. ఖర్చులు పోనూ రూ.50 లక్షలు చేతికి వచ్చాయని రైతు చెబుతున్నాడు. ఇదే స్ఫూర్తితో ఇప్పుడు మరో మూడెకరాల్లో హెచ్‌ఆర్‌ఎంఎన్-99 అనే రకం ఆపిల్ తోటను సాగు చేశారు. ఇలా అప్పటికప్పుడు లాభాలు వచ్చే పంటలే కాకుండా దీర్ఘకాలికంగా దిగుబడిని ఇచ్చే విభిన్న పంటలు సాగు చేస్తున్న రాంచంద్రారెడ్డి ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
రెండు నెలల్లో రూ.50 లక్షలు
నేను చెబితే ఎవరూ నమ్మరు.. కానీ, ఇది నిజం. ఎంత సేపు వరి, పత్తి పంటలు వేస్తుండెటోన్ని. ఆ పంటల మీద యాస్టచ్చింది. వేరే పంటలు ట్రై చేద్దామని మూడేండ్ల కింద డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేసిన. ఏడాది తర్వాత మంచి లాభం వచ్చింది. పెడితే ఇసోంటి పంటలే పెట్టాలనే నిర్ణయానికి వచ్చిన. మంచి లాభాలిచ్చే పంటలు ఏమున్నయని చూస్తే మస్క్‌మిలన్ కనిపించింది. పెడితే పెద్ద మొత్తంలనే పెట్టాలనుకున్న. 8 ఎకరాల్లో వేసిన ఇంత మంచి దిగుబడి వస్తదని, ఇంత లాభమస్తదని నేను ఊహించలే. 9 లారీల్లో ఢిల్లీకి తీసుకెళ్లి మార్కెట్ చేసుకొచ్చా. రెండు నెలల్ల రూ.76 లక్షలు వచ్చినయ్. ఖర్చులు పోను రూ.50 లక్షలు మిగిలినయ్. అటు దీర్ఘకాలిక పంటగా డ్రాగన్ ఫ్రూట్, ఇటు సీజనల్‌గా మస్క్‌మిలన్ పంటలతో మంచి లాభమచ్చింది. ఇట్లనే మరో వెరైటీగా ఆపిల్ సాగు చేయాల్ననే ఆలోచన వచ్చింది. ఎండలను సైతం తట్టుకుని కాచే ఓ ప్రత్యేక రకమైన మొక్కలను హిమాచల్ ప్రదేశ్ నుంచి తెప్పించిన. ఒక ఎకరంలో 700 మొక్కలు నాటి ఏడాది అవుతోంది. ఇంకో నాలుగేండ్లయితే ఆపిల్ కూడా దిగుబడి వస్తది. వరి, పత్తి పండించవద్దని నేననడం లేదు. ఎంత సేపు అవే పంటలు మంచిది కాదు. ఇలాంటి పంటలు కూడా పండిస్తే రైతుల బతుకులు పూర్తిగా మారిపోతయ్.
రైతుల ఆలోచన మారాలి
రైతు అంటే నా దృష్టిలో ఎంతో బాధ్యతగల వాడు. దేశానికి అన్నం పెట్టేవాడు. మంచి ఆహారాన్ని అందించినపుడే దేశం ఆరోగ్యంగా ఉంటుందనేది నా భావన. సాంప్రదాయ పంటలు పండించడంతోనే రైతు బాధ్యత తీరిపోదు. సమాజానికి ఆరోగ్యాన్నిచ్చే పంటలు కూడా పండించాలి. నేను సాగు చేస్తున్న అంజీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తేనెకన్నా తీయదనం ఇందులో లభిస్తుంది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మన జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చి నా వద్ద అంజీర తీసుకెళ్తారు. అందుకే నేనే స్వయంగా ప్యాకింగ్ చేసి అమ్ముతుంటా. అయోమయ స్థితిలో దారి తెన్ను తెలియకున్న రైతులకు ఇలాంటి పంటలు లాభసాటిగా ఉంటాయి. అలాగని ఎక్కువ తక్కువ సాగు చేయడం మంచిది కాదు. ఇలాంటి పంటల సాగు చాలా శ్రమతో కూడుకున్నది. పూర్తిగా అవగాహన పెంచుకున్న తర్వాత మార్కెట్ సీజన్‌కు అనుగుణంగా దిగుబడులు వచ్చే విధంగా సాగు చేసుకోవాలి.
చెట్టు చిన్నదే.. కాత ఘనం
జామ అంటే ఇష్టపడని వారుండరు. ఈ పండును చూడగానే తినాలనిపిస్తుంది. అలాంటి జామలో ఓ ప్రత్యేక రకాన్ని ఎంచుకుని సాగు చేస్తున్నారు రామడుగు మండలం చిప్పకుర్తికి చెందిన రైతు ఎడవెల్లి భూపతిరెడ్డి. తైవాన్ నుంచి తెప్పించిన ఈ జామను హైడెన్సిటీ పద్ధతిలో దగ్గర దగ్గర మొక్కలు నాటారు. కనీసం మీటరు ఎత్తు కూడా లేని ఈ చెట్లు విరగకాస్తున్నాయి. పండ్లతోటలో ప్రతి చెట్టుకు పది కిలోలకు తక్కువ కాకుండా కాత వస్తోంది. దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రోడ్డు మీద స్టాల్ పెట్టి కూడా రోజువారీగా అమ్మేస్తున్నారు. మార్కెట్‌కు తరలించి కూడా విక్రయిస్తున్నారు..
డిమాండ్‌కు అనుగుణంగా..
రామడుగు మండలం తిర్మలాపూర్‌కు చెందిన ఇతని పేరు కట్ల శ్రీనివాస్. మూడేళ్ల కింద వెట్ఫ్రూట్ రకం అంజీరా మొక్కలను టర్కీ నుంచి తెప్పించి రూ.1.50 లక్షల పెట్టుబడితో రెండెకరాల్లో సాగు చేశాడు. నాటిన ఏడాది నుంచే కాపు వస్తున్నది. జనవరి లేదా ఫిబ్రవరి నుంచి మే, జూన్ వరకు దిగుబడి వస్తున్నది. ప్రతి నెలా 20 రోజుల చొప్పున ఏడాదిలో వంద రోజులు దిగుబడి వస్తుండగా, శ్రీనివాస్ స్వయంగా ప్యాక్‌చేసి రిటేల్‌గా అమ్ముతున్నాడు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అంజీరా సాగు చేసిన మొదటి రైతు ఇతనే. ఇలాంటి విభిన్నమైన పంటలు పండిస్తున్న శ్రీనివాస్ ఏ సీజన్లో ఎలాంటి పంటలు లాభసాటిగా ఉంటాయో గ్రహించి అవి సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతని క్షేత్రంలో 30 గుంటల్లో బంతి, మరో 3 ఎకరాల్లో బెండ సాగు చేశాడు. ఇప్పుడు బంతికి, వేసవిలో బెండకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇలా మార్కెట్లో ఎప్పటికప్పుడు డిమాండ్ కనుగుణంగా పంటలను సాగు చేస్తూ శ్రీనివాస్ ఆదర్శంగా నిలుస్తున్నాడు.