Farmers’ welfare | కమాన్ పూర్, ఏఫ్రిల్ 13: రైతుల సంక్షేమమే ధ్యేయంగా, రైతును రాజుగా చేసే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మండలంలోని జూలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆదర్శనగర్ లో ఆదివారం పీ.ఏ. సీ. ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో ₹ 40 వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. రైతులు పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. వరి దాన్యం విక్రయించే రైతులందరికి కనీస మద్దతు ధరతో వరి దాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైతుల సంకమం, అభ్యున్నతే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తగు ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు.
అంతకు ముందు కమాన్ పూర్ మండల కేంద్రంలోని స్వర్గీయ మాజీ శాసన సభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహానికి మంత్రి శ్రీధర్ బాబు తన తనయుడితో కలిసి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కమాన్ పూర్ గ్రామ పంచాయతీ సపాయి కార్మికులకు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు శ్రీపాదరావు వర్ధంతిని పురష్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షీల్డ్ ల బహుకరణ కార్యక్రమంలో పాల్గొని పలువురికి షీల్డ్ లు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.