Konduri Ravinder Rao | కోరుట్ల, మే 12: కేడీసీసీబీ బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు. పట్టణంలోని కల్లూరు రోడ్డులో రూ.69 లక్షలతో నిర్మించిన కేడీసీసీ బ్యాంకు పట్టణ శాఖ నూతన భవనాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు.
ఈసందర్భంగా కేడీసీసీ చైర్మన్ మాట్లాడుతూ సహకార బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలను తక్కువ వడ్డీకి అందిస్తున్నామని తెలిపారు. ఆధునిక పద్ధతుల్లో పంటలు పండించడానికి అవసరమైన పరికరాలకు రుణాలు అందించనున్నట్లు చెప్పారు. సహకార బ్యాంకుల ద్వారా నిరుపేద విద్యార్థులకు కూడా రుణాలు అందిస్తామని చెప్పారు. కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. కోరుట్ల కేడీసీసీ బ్యాంకు రూ.205 కోట్ల టర్నోవర్ సాధించిందని తెలిపారు.
రైతుల అభివృద్దే ధ్యేయంగా రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకున్న సహకార సంఘాల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలోనే జిల్లా కేడీసీసీ బ్యాంకు రుణాల పంపిణీలో ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ జిల్లాలో సహకార సంఘాలు నిలదొక్కుకోవడానికి కొండూరి రవీందర్రావు కృషి అభినందనీయమన్నారు.
జిల్లా కేడీసీసీ బ్యాంకు రూ.10 వేల కోట్ల టర్నోవర్ సాధించడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. కేడీసీసీ బ్యాంకు సేవలను రైతులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, బ్యాంకు మేనేజర్ మున్వర్, కేడీసీసీ డైరెక్టర్లు, సింగిల్ విండో చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.