తిమ్మాపూర్,ఫిబ్రవరి13: యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సొసైటీలో యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని సమాచారంతో గురువారం నాడు రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కానీ సొసైటీకి 470 బస్తాలు మాత్రమే రావడంతో కొంతమంది రైతులకు బస్తాలు దొరకలేదు. దీనిపై పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుకుబడి ఉన్నవాళ్లకే యూరియా బస్తాలు అందజేశారని మండిపడ్డారు. తక్కువ బస్తాలే ఉన్నప్పుడు అందరికీ వచ్చేలా చూడాలని కదా అని ప్రశ్నించారు.
రైతులు కోపోద్రేక్తులు కావడంతో సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, సీఈవో ఆంజనేయులు వారిని సముదాయించారు. ఆందోళన చెందవద్దని.. శుక్రవారం నాడు అందరికీ సరిపోయేలా యూరియా అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు కాస్త శాంతించారు. అనంతరం డబ్బులు చెల్లించినా యూరియా బస్తాలు రానివారికి నగదు రిటర్న్ చేశారు.