కరీంనగర్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆది నుంచి తెలంగాణ రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. 14 ఏండ్లు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని, అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ రైతుల కోసం ప్రత్యేకంగా అనేక పథకాలు తెచ్చారు. 24 గంటల పాటు ఉచిత కరెంటు, పెట్టుబడి కోసం రైతుబంధు వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా పంటలు పండించేందుకు అనువుగా కాళేశ్వరం నీళ్లను అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రైతులు ఉమ్మడి రాష్ట్రంలో బీళ్లుగా పడి ఉన్న భూములను సాగుకు యోగ్యంగా మార్చుకుని పంటలు తీస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ఇక్కడి ఆ పార్టీ నాయకులకు కడుపు మంట మొదలైంది. తెలంగాణలో పండిన పంటను చూసి ఇంత పెద్ద మొత్తంలో పంట ఎలా వచ్చిందని ఇక్కడి రైతులను అవమాన పర్చేవిధంగా కేంద్ర మంత్రులు అనుమానాలు వ్యక్తం చేసిన విషయాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు యాసంగిలో ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో రైతుల పక్షాన ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ‘మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు. మీకు పనులు లేవా?’ అంటూ అవమాన పర్చే విధంగా మాట్లాడడాన్ని కూడా రైతులు తీవ్రంగా ఖండిస్తున్నారు. గోయల్ వెంటనే తెలంగాణ రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతులపై రాజకీయం..
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో పెద్ద మొత్తంలో పంటలు ముఖ్యంగా వరి దిగుబడులు వస్తున్నాయి. దీంతో రైతులకు మంచి ఆదాయం వస్తోంది. క్రమంగా సంపన్న రాష్ట్రంగా అవతరించే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం పారాబాయిల్ట్ (ఉప్పుడు) బియ్యం కొనమని చేతులెత్తేయడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని రైతులకు అవగాహన పెంచే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడి బీజేపీ నాయకులు ఇందుకు భిన్నంగా వరి సాగు చేయాలని రైతులను రెచ్చగొట్టారు. వాస్తవాలు తెలుసుకున్న రైతులు యాసంగిలో బియ్యాన్ని కొంటరా?, కొనరా? అని కేంద్రాన్ని నిలదీస్తూ టీఆర్ఎస్ చేపట్టిన పలు ఆందోళనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసనలు తెలిపారు. ఎంత చేసినా రైతులు తమ వైపే ఉన్నారని కుట్రలు పన్నుతున్న బీజేపీ ఇప్పుడు నిల్వ ఉన్న బియ్యాన్ని కూడా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదని టీఆర్ఎస్ నాయకులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్లిన మంత్రుల బృందం కేంద్రంతో తాడోపేడో తేల్చుకోనిదే తిరిగి రామని అక్కడే భీష్మించుకుని కూర్చున్నది. తమ కోసం ఢిల్లీ సర్కారుతో పోరాడుతున్న మంత్రులకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతులు సంఘీభావం తెలుపుతున్నారు.
అబద్ధాలు చెబుతున్న కేంద్రం
ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకుంటామని చెప్పినా ఇవ్వడం లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అబద్ధ్దాలు ప్రచారం చేస్తోందని టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. నిజానికి మిల్లర్ల వద్ద కూడా సరిపడే గోదాం వ్యవస్థ లేదు. వానకాలం సీజన్లో వచ్చిన వడ్లలో సివిల్ సప్లయ్స్ వాళ్లు తకు కేటాయించిన మొత్తాన్ని తీసుకుని మిల్లుల్లో, స్థలం లేక బయట ఆవరణల్లో నిల్వ చేసుకున్నారు. బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి ఇద్దామంటే ఏ గోదాములో కూడా స్థలం ఉండడం లేదు. ర్యాకులు కేటాయించని కారణంగా గోదాములన్నీ బియ్యంతో నిండి ఉన్నాయి. గత వారం రోజుల వరకు రెగ్యులర్‌గా బియ్యం గోదాములకు పంపిన మిల్లర్లకు ఎఫ్‌సీఐ అధికారులు చుక్కలు చూపించారు. గోదాముల్లో స్థలం లేక లారీలు రోజుల తరబడి అక్కడే నిలవాల్సి వచ్చింది. లారీల ఓనర్లు మిల్లర్లపై అదనంగా వెయిటింగ్ చార్జీలు వేశారు. ధాన్యం కొనుగోలు చేసి బియ్యంగా మార్చడం వరకే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఉంటుంది. కేంద్రానికి ఇస్తామన్న బియ్యం గోదాముల్లో మూలుగుతుంటే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాత్రం ఇస్తామన్న బి య్యం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఉల్టా ఆరోపించడాన్ని ఇటు రైతులు, అటు మిల్లర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. గోదాముల్లో ఉన్న బియ్యాన్ని ర్యాకులు కేటాయించుకుని తరలించుకుంటే వద్దనేది ఎవరో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే చెప్పాలి.
అవమానించడం అవివేకం
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర మంత్రులను అవమాన పరిచే విధంగా మాట్లాడడం ఆయన అహంకారానికి, అవివేకానికి నిదర్శనం. రాష్ట్రంలో బీజేపీ నాయకులేమో ఒక్కొక్కరు ఒక్కో తీరుగ మాట్లాడుతున్నరు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇస్తలేదు. హామీలను నెరవేరుస్త లేదు. ఇక్కడి బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి ఏం చేస్తున్నట్టు. రాష్ట్ర ప్రయోజనాలు వారికి పట్టవా?. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలి.
-విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ (హుజూరాబాద్‌టౌన్)
జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తాం
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై క్లారిటీ ఇవ్వకపోతే పంజాబ్ రైతుల లెక్కనే మేం కూడా జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తాం. అప్పుడైనా కేంద్రానికి మాపై దయాదాక్షిణ్యం కలుగుతుందేమో.. కేంద్ర మంత్రులు కొనుగోలుపై ఇప్పటి వరకు మా మంత్రులకు క్లారిటీ ఇవ్వకపోగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అన్నం పెట్టే రైతులను అవమానపర్చితే ఊరుకోం. తెలంగాణాలో కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు, కుంటలు నిండుగా ఉన్నయ్. 24 గంటల కరెంటు ఉంది. కానీ, కేంద్ర ప్రభుత్వం క్లారిటీ లేక వరి పంట సాగు చేయాలా? లేదా? అన్న సందేహంలో ఉన్నాం.