చిగురుమామిడి, ఆగస్టు 24: అన్నదాతలు యూరియా కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చిగురుమామిడి మండలంలో నిద్రాహారాలు మాని పడిగాపులు గాశారు. అయినా దొరక్క నిరాశ చెందారు. శనివారం సాయంత్రం తర్వాత ఇందుర్తి సొసైటీకి 400 బస్తాలతో లారీ రాగా, విషయం తెలుసుకొని రైతులు తరలివచ్చారు.
దాదాపు 300 మంది అర్ధరాత్రి 12.30 గంటల వరకు పడిగాపులు గాశారు. సిబ్బంది ఉదయం ఇస్తామని చెప్పడంతో క్యూలో చెప్పులు పెట్టి ఇండ్లకు వెళ్లిపోయారు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున 5గంటల నుంచి తరలివచ్చారు. సుమారు 800 మందికి పైగా బారులు తీరారు. యూరియా కోసం పోటీ పడ్డారు. నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు చేరుకొని గొడవ జరగకుండా చూశారు. ఉదయం 6గంటల నుంచి 7.30 గంటల మధ్య పంపిణీ చేశారు.
ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున ఇచ్చారు. సుమారు 600 మందికి బస్తాలు అందక నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్ధరాత్రి నుంచి ఉన్న రైతులను కాదని తెల్లవారుజామున వచ్చిన వారికి యూరియా ఇచ్చారని ఆగ్రహించారు. నాట్లేసి నెలదాటిందని, అయినా యూరియా దొరకడం లేదని, పంట దెబ్బతింటున్నదని ఆవేదన చెందారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి కొరత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని వాపోయారు.
20రోజులు తిరిగితే రెండు బస్తాలు దొరికినయ్
నాకు పదెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని 12 ఎకరాలలో వరి వేసిన. యూరియా కోసం ఇరవైదు రోజులుగా తిరుగుతున్న. రెండుసార్లు యూరియా వస్తే రెండుసార్లు లైన్లో ఉన్నా దొరకలే. శనివారం రాత్రి 12 గంటల వరకు లైన్లో ఉన్న. చెప్పులు క్యూలో పెట్టి ఇంటికి వచ్చిన. మళ్ల తెల్లవారుజామున 5:30 గంటలకే వెళ్లి లైన్లో ఉన్న. నాకు రెండు బస్తాలు ఇచ్చిన్రు. ఎకరానికి రెండు బస్తాలు అవసరముంటుంది.
ఇది ఏ మూలకు సరిపోతది. మళ్ల యూరియా ఎప్పుడు వస్తదో చెప్తలేరు. అధికారులను అడిగితే సమాధానం దాటావేస్తున్నరు. బీఆర్ఎస్ పాలనలో ఏ రోజూ కొరత రాలే. రైతులకు ఇబ్బంది లేకుండా ఉండే. కాంగ్రెస్ పాలన రైతులకు ఇబ్బంది అయితంది. శనివారం 400 బస్తాల లోడు వస్తే 800 మందికి పైగా రైతులు తెల్లవారుజామునే వచ్చిన్రు. యూరియా కోసం పోటీపడ్డరు. అయినా చాలా మందికి దొర్కలే. ఇట్ల రైతులను గోస పెట్టుడు సరికాదు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ కొరత లేకుండా చూడాలి. రైతులందరికీ అవసరానికి సరిపడా అందించాలి.
– కాంతాల శ్రీనివాస్ రెడ్డి, రైతు (ఇందుర్తి)