ఎల్లారెడ్డిపేట, మే 4: ‘అయ్యో దేవుడా.. ఎంత పనిజేస్తివి. మా ఇంటి గోవును తీసుకపోతివివా..?, మమ్ముల ఎక్కడ కాకుంటా చేస్తివా..?’ అంటూ ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గరాజేశ్వర తండాకు చెందిన బానోత్ రాజునాయక్ పాడి ఆవుపై పడి కన్నీటిపర్యంతమయ్యాడు. ఉపాధికి ఊతమిస్తూ.. కుటుంబానికి బతుకుదెరువు చూపుతున్న మూగజీవి అగ్గి పిడుగుతో మత్యువాతపడడంతో గుండెలవిసేలా రోదించాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజునాయక్ తన పాడి ఆవును వరి కోత పూర్తయిన తన పొలంలో మేత కోసం కట్టేశాడు. సాయంత్రం ఉరుములు మెరుపులు ప్రారంభమై ఒక్కసారిగా పడిన అగ్గిపిడుగుతో అక్కడికక్కడే మృతి చెందగా, అతని కుటుంబ సభ్యుల ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ఆవు విలువ రూ.40వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.