మిర్యాలగూడ, మార్చి 7: అటవీ భూముల్లో పట్టాలు ఇప్పిస్తానంటూ నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి పలువురిని మోసం చేసిన ఘటన నల్లగొండ జిల్లాలో వెలుగుచూసింది. బాధితులు మిర్యాలగూడ వన్‌టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో తాజాగా ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. తిరుమలగిరి(సాగర్) మండలంలోని భోజ్యాతండాకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి ఇదే మండలంలోని నేతాపురం గ్రామ పరిధిలోని అటవీ శాఖ భూములకు పాస్ పుస్తకాలు ఇప్పిస్తానంటూ అక్రమ దందా చేస్తున్నారు. ఇలా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మహిమూద్ అలీ నుంచి రూ.4లక్షలు తీసుకుని నేతాపురం గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్ 62/ఇ4లోని 16.2 ఎకరాల భూమికి 2018 ఏప్రిల్ 25న, సర్వే నెంబర్లో 62/అ/3 5.32 ఎకరాలకు అదే ఏడాది మే 21న నకిలీ పాస్‌బుక్‌లు ఇచ్చాడు.
మిర్యాలగూడ మండలం తడమకళ్ల గ్రామానికి చెందిన షోయబ్‌కు 4.27 ఎకరాల భూమి పట్టా చేయించి ఇస్తానంటూ ఎకరాకు రూ.3.50 లక్షలకు బేరం మాట్లాడుకున్నాడు. రిజిస్ట్రేషన్ ఖర్చుల పేరుతో అడ్వాన్స్‌గా రూ.35వేలు తీసుకున్నాడు. షోయబ్‌కు వాట్సాప్‌లో పట్టా వివరాలను పంపించాడు. వాటిని అతడు ఆన్లైన్లో చెక్ చేయగా, ఫేక్ అని తేలడంతో మిర్యాలగూడ పోలీసులను ఆశ్రయించాడు. కాగా, నేతాపురంలో అటవీ భూములకు పట్టాలు చేయిస్తానంటూ ప్రసాద్ నాలుగేండ్లుగా అనేక మంది నుంచి లక్షల్లో వసూళ్లు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు సెల్‌ఫోన్ స్విచ్ఆఫ్లో ఉన్నట్లు తెలిపారు. ప్రసాద్ భోజ్యాతండా నుంచి మిర్యాలగూడ పట్టణానికి మకాం మార్చాడని, కొంతకాలం గూడూరు పరిధిలోని ఒక తండాలో ఉన్నాడని సమాచారం.
అతడు ఇచ్చిన పాస్ పుస్తకాలు నకిలీవి అని తేలడంతో బాధితులు మరింత మందికి బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, ధరణి పాస్ పుస్తకం నమూనాను కాపీకొట్టి డిజిటల్ సంతకాలను ఫోర్జరీ చేసి సర్వే నెంబర్లు, విస్తీర్ణం, భూమి ఎలా వచ్చిందనే వివరాలను ముద్రించడంతో ఈ వ్యవహారం అంతా ఎక్కడి నుంచి నడిచిందనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేతాపురం పరిధిలోని ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇప్పిస్తానని ప్రసాద్ అనే వ్యక్తి మోసం చేసినట్లు ఇద్దరు బాధితులు పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారని, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దింపామని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. అతడిని పట్టుకోవడంతోపాటు నకిలీ పాస్‌పుస్తకాలు తయారు చేసిన ముఠా, ఫోర్జరీ సంతకాలు చేసిన వారిని త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.