Kamanpur | కమాన్ పూర్, సెప్టెంబర్ 7 : అధికారం లక్ష్యంగా అడ్డదిడ్డంగా ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ప్రజల ముందు 420గా నిలిచిందని బీఆర్ఎస్ కమాన్ పూర్ మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ శంకర్, యూత్ మండల మాజీ అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడ్ మండిపడ్డారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వంద రోజుల్లో 1000 రోజుల పాలనలో హామీల అమలులో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని ఆచరణలో వెంటనే అమలు చేయాలని కోరుతూ ఎంపీడీవో ప్రియాంక కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఏమోకాని ఉన్న సంక్షేమ పథకాలను కూడా ఎత్తేసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బీమా పథకానికి ఇన్స్యూరెన్స్ చేయకపోవడంతో ఈ పతకాలు ఇక పై ఉండకపోవచ్చునని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి పథకాల అమలుపై కూడా నీలినీడలు అలుముకుంటున్నాయన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ, 12 వేలు ఇస్తామని చెప్పి మాట తప్పి వారి బతుకులను ఆగం చేసిందన్నారు.
ఇంటింటికి ఆడబిడ్డలకు నెలకు రూ, 2500 లు ఇస్తామని చెప్పి నట్టేట ముంచిందని ఆరోపించారు. పింఛన్ లు పెంచుతామని వితంతువులకు, వికలాంగులకు , వృద్ధులకు ఆశ చూపించి వారి ఆశలను అడియాసలు చేసిందని ఆరోపించారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతల మాటలు బూటకపు మాటలని ఈ 1000 రోజుల పాలనలో తేటతెల్లమైందన్నారు. అన్ని వర్గాల ప్రజలను మాయ మాటలతో మభ్యపెట్టి ఓట్లను దండుకుని గద్దెనెక్కాక మాట మార్చి దగా చేసిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలంలో తగిన బుద్ది చెప్పడానికి ప్రజలు సంసిద్దంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.