Municipal Corruption | కరీంనగర్ అక్టోబర్ 29 : కరీంనగర్ నగరపాలక సంస్థ (బల్దియా) సానిటేషన్ విభాగంలో కొందరు అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడుతూ సంస్థ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఇంటింటి చెత్త సేకరణ కోసం వినియోగిస్తున్న ‘స్వచ్ఛ ఆటోల’ విషయంలో జరుగుతున్న ఆర్థిక అక్రమాలే ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. నగరంలో మొత్తం 126 స్వచ్ఛ ఆటోలు చెత్త సేకరణ విధుల్లో ఉన్నాయి. వీటిలో 106 ఆటోలు ‘డ్రైవర్ కమ్ ఓనర్’ పథకం కింద నడుస్తుండగా మిగిలిన 20 ఆటోలు నేరుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రతి ఆటో సుమారు 300కు పైగా ఇళ్ల నుంచి చెత్త సేకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి ఇంటి నుంచి నెలకు రూ. 50 యూజర్ ఛార్జీ వసూలు చేస్తారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న 20 స్వచ్ఛ ఆటోలు కూడా ప్రజల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ ఆ మొత్తం గత మూడేళ్లుగా బల్దియా ఖజానాకు చేరడం లేదని తెలుస్తోంది. వసూలు చేసిన ఈ యూజర్ ఛార్జీల డబ్బులు కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు జవాన్లు కలిసి పంచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల క్రితం వరకు సక్రమంగా బల్దియాకు ఆదాయం వచ్చేదని, కానీ అప్పటి నుంచి పూర్తిగా నిలిచిపోయిందని ఆ విభాగంలోని అధికారులే అనధికారికంగా చెప్తున్నట్లు సమాచారం.
స్వచ్ఛ ఆటో డ్రైవర్ల నుంచి ‘మామూళ్ల’ వసూలు
కేవలం యూజర్ ఛార్జీల మళ్లింపుతో ఆగకుండా ఈ విభాగం సిబ్బంది ఇతర అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. నగరంలో నడుస్తున్న ప్రతి స్వచ్ఛ ఆటో నుంచి నెలకు రూ. 1,000 చొప్పున పారిశుధ్య విభాగం అధికారులు ‘మామూళ్లు’ డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డ్రైవర్లు ఈ ముడుపులు ఇవ్వడానికి నిరాకరిస్తే కాలనీల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని బెదిరించి వారిని విధుల్లోంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నట్లు డ్రైవర్లు వాపోతున్నారు. ఈ మామూళ్లు యూజర్ ఛార్జీల పంపిణీ ద్వారా ప్రతి నెలా భారీ మొత్తంలో డబ్బులు ఈ విభాగం అధికారులు, సిబ్బంది చేతుల్లోకి మారుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు ఈ అక్రమ దందాపై ప్రత్యేక దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపితే బల్దియాకు జరుగుతున్న నష్టం మరియు అక్రమార్కుల బాగోతం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నగర ప్రజలు కోరుకుంటున్నారు.