Kerala Governor : తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగానే కేరళలో కూడా అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే వివాదం చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Vishwanath Arlekar).. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలోని అన్ని అంశాలను చదవలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్న ఆ అంశాలను ఆయన వదిలేశారు.
దాంతో కేరళ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తంచేసింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విధాన ప్రసంగంలోని రెండు భాగాలను ఆయన వదిలేశారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. అర్లేకర్ సభ నుంచి నిష్క్రమించిన తర్వాత సీఎం మాట్లాడుతూ.. ప్రసంగంలోని 12వ పేరా ప్రారంభ అంశాలను, 15వ పేరా ముగింపు అంశాలను గవర్నర్ చదవలేదని స్పీకర్‌కు తెలిపారు.
ఈ సందర్భంగా స్పీకర్ ఏఎన్ షంషీర్ స్పందిస్తూ.. సభా నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విధాన ప్రసంగాన్నే అధికారికంగా భావిస్తామని స్పీకర్ చెప్పారు. కొన్ని అంశాలను వదిలేస్తూ గవర్నర్ చేసిన ప్రసంగాన్ని అధికారికంగా గుర్తించబోమని చెప్పారు. ఇదిలావుంటే తమిళనాడు శాసనసభ సమావేశంలో కూడా అక్కడి గవర్నర్ ప్రసంగం మధ్యలో అసెంబ్లీ నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.