High BP | ప్రస్తుతం మనలో చాలా మందిని ఇబ్బందికి గురి చేస్తున్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు కూడా ఒకటి. అత్యంత సాధారణ జీవనశైలి వ్యాధుల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని అధిక రక్తపోటు ప్రభావితం చేస్తుంది. అయితే అధిక రక్తపోటు బారిన పడిన వెంటనే ఎటువంటి లక్షణాలు కనిపించవు. దాదాపు 44 శాతం మందికి వారు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారన్న సంగతి కూడా తెలియడం లేదని వైద్యులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారం అధిక రక్తపోటును ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. కొన్ని ఆహారాలు రక్తపోటును తగ్గించేవి అయితే కొన్ని రక్తపోటును పెంచేవి అయి ఉంటాయి. మన ఆహారపు అలవాట్లలో సరళమైన మార్పులు చేసుకోవడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు మొత్తం ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. రక్తపోటుతో బాధపడే వారు తీసుకోవాల్సి ఆహారాలతో పాటు తీసుకోకూడని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక రక్తపోటుకు ప్రధానం సోడియం. ఆకుకూరల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో అదనంగా ఉండే సోడియంను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తనాళాలు సండలించడతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. అరటిపండ్లల్లో కూడా పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా అరటిపండ్లు మనకు సహాయపడతాయి. ఓట్స్ లో బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలు కూడా నిర్వహించబడతాయి.
అలాగే బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లల్లో ఆంథోసైనిన్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఈ పండ్లను తీసుకోవడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా రక్తనాళాలు విస్తరించడంతో పాటు రక్తపోటు కూడా తగ్గుతుంది. సాల్మన్, మాకేరెల్ వంటి చేపలను ఆహారంగా తీసుకోవాలి. వీటిలో ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రించబడుతుంది. ఇటువంటి ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది. ఇక రక్తపోటుతో బాధపడే వారు వేయించిన ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి. ఇవి కాలక్రమేణానా ధమనుల వాపుకు దారితీయడంతో పాటు అవి గట్టిపడేలా చేస్తాయి. దీంతో రక్తపోటు పెరుగుతుంది. కనుక వేయించిన ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి.
సాసేజ్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకోవడం తగ్గించాలి. వీటిని సోడియం, నైట్రేట్ల వంటి వాటితో ప్రిజర్వ్ చేస్తారు. వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. కనుక వీటిని తీసుకోవడం కూడా తగ్గించాలి. నిల్వ పచ్చళ్లు కూడా రక్తపోటు పెరిగేలా చేస్తాయి. వీటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కనుక అధిక రక్తపోటుతో బాధపడే వారు పచ్చళ్లను తీసుకోవడం మానేయాలి. సోడాలు, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిని తీసుకోవడం తగ్గించాలి. వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశం 26 శాతం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్ వంటి వాటిల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. కాలక్రమేణా రక్తపోటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఫాస్ట్ ఫుడ్ ను తినడం మానేయాలి. ఇలాంటి ఆహారాలు రక్తపోటును పెంచడంతో పాటు మొత్తం శరీరానికి హానిని కలిగిస్తాయి. కనుక వీటికి దూరంగా ఉండడం మంచిది. సమతుల్య ఆహారాన్ని, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల, ఉప్పును తక్కువగా తీసుకుంటూ, రోజూ వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.