Agriculture Special | ఆయన వృత్తి ఉద్యోగం. ప్రవృత్తి వ్యవసాయం. తండ్రి సాగు బాటే తన వృత్తి బాటగా ఎంచుకున్నాడు. వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి, ఏఈవోగా ఉద్యోగం సాధించిన అతను, అంతటితో ఆగకుండా తనకు ఇష్టమైన ప్రకృతి వ్యవసాయంలోకి దిగి అంతరించిపోతున్న దేశవాళీ వరి వంగడాల మనుగడకు నడుంబిగించాడు. తన మూడెకరాల వ్యవసాయ క్షేత్రాన్నే కార్యశాలగా మార్చుకొని అరుదైన విత్తన రకాలను సేకరిస్తూ విత్తనోత్పత్తి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
‘ఒక విత్తనం మనుగడలో ఉండాలంటే ప్రతి ఏటా సాగు చేయాల్సిందేనన్న’ విషయాన్ని మదిలో ఉంచుకొని ఒకటి కాదు రెండు కాదు 300 రకాల దేశీ వంగడాలను విడుతలవారీగా ఒక్కో రకాన్ని ఐదు గుంటల చొప్పున పండిస్తూ పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన యాదగిరి శ్రీనివాస్, పురాతన విత్తనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. శ్రీనివాస్ ఉత్పత్తి చేసిన రకాలకు దేశ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉండగా, ఆర్డర్లపై కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రైతులకు ఎగుమతి చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. ఇప్పటివరకు ఎన్నో ఉత్తమ రైతు అవార్డులు స్వీకరించి, ఆదర్శ రైతుగా పేరుపొందాడు.
పెద్దపల్లి, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): మాములుగా ఒకరకం వరి పంట పండించాలంటేనే ఈ రోజుల్లో రైతులు ఎంతో శ్రమించాల్సి వస్తుంది. అటువంటిది పెద్దపల్లి జిల్లాలో ఓ రైతు ఏకంగా 300 రకాల వరిని పండిస్తున్నాడు. వాటిలో కొన్ని కనుమరుగవుతున్న వరి రకాలు ఉండగా, మరికొన్ని సాంప్రదాయ రకాలు కూడా ఉన్నాయి. తనకున్న మూడెకరాల పొలంలోనే ఈ 300 రకాల వరిని పండించడం విశేషం. మన పంట మన ఆరోగ్యం, జీవ వైవిధ్యంలో దేశీ వరికి సంబంధించి మొదట 5 రకాల వరి మాత్రమే సాగు చేసిన మంథనికి చెందిన యాదగిరి శ్రీనివాస్, ఇప్పుడు 300 వందల రకాల వరి వంగడాలు సాగు చేస్తూ, భావితరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తి సేంద్రియ విధానంలో సొంతంగానే జీవామృతం తయారు చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు.
యాదగిరి శ్రీనివాస్‌ది పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం. 2002-04 లో పొలాస వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా పూర్తి చేశాడు. అనంతరం వ్యవసాయాన్నే వృత్తిగా ఎంచుకొని శాస్త్రీయ విధానాలతో మంచి దిగుబడులు సాధించాడు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ 2011 లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఉత్తమ వరి రైతుగా, సేంద్రియ రైతుగా ఎంపికయ్యాడు. అదే ఏడాది వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ)గా ఉద్యోగం వచ్చింది. అటు ఉద్యోగం చే స్తూ ఇంటి దగ్గర స్వతహాగా సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేయ డం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అంతరించిపోతున్న దేశీయ, పురాతన వరి వంగడాలను మనుగడలో ఉంచాలని సంకల్పించాడు.
దేశవాళీ విత్తన సంపద పరిరక్షణకు నడుంబిగించిన శ్రీనివాస్ 2016లో తన పొలాన్నే కార్యశాలగా మార్చుకున్నాడు. తొలుత నాలుగు పిల్లర్లు వేసి దానిపై కంటైనర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అదే కంటైనర్‌లో రెండు గదులను ఏర్పాటు చేసుకొని తన భార్య, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. కంటైనర్ కింది భాగంలో సైతం గదులను ఏర్పాటు చేసుకొని ఫాంహౌస్ నిర్మించుకొని ఉద్యోగంలో దొరికే తీరిక సమయాన్ని వ్యవసాయానికే కేటాయిస్తున్నాడు.
ఈ క్రమంలో “ఒక విత్తనం మనుగడలో ఉండాలంటే అది ప్రతి సంవత్సరం సాగులో ఉండాల్సిందే’ అన్న విషయాన్ని మదిలో ఉంచుకొని దేశీ వంగడాలను ఇతర ప్రాంతాల నుంచి సేకరిస్తున్నాడు. తన క్షేత్రంలో ఒక్కో వంగడాన్ని ఐదు గుంటల విస్తీర్ణంలో పండిస్తూ విత్తనోత్పత్తి చేస్తున్నాడు. మొదట అరుదైన ఐదు ర కాలను సేకరించిన శ్రీనివాస్, ప్రకృతి వ్యవసాయ విధానంలో విత్తనోత్పత్తి చేసి సక్సెస్ అయ్యాడు. అలా మొదలైన వంగడాల పరిరక్షణ ఈ రోజు 300 రకాలకు చేరింది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ కృషిని గుర్తించిన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు దేవదేవుని ప్రసాదంగా ప్రతిరోజూ ఒక దేశవాళి బి య్యంతో తయారు చేయాలనే సం కల్పంతో “కాంతియా నొయి లి” అనే విత్తనాన్ని శ్రీనివాస్‌కు అందించా రు. వాటిని విత్తనోత్పత్తి చే శాడు. ఏడు నెలలు మా గిన అనంతరం వా టిని బియ్యంగా మార్చి దాదాపు రెండు లోడ్లు పంపించారు.
శ్రీనివాస్ పరిరక్షిస్తున్న దేశీ వంగడాలకు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఒక్కో రకానికి ఒక్కో ప్రత్యేకత ఉండడం, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి కావడంతో చాలా మంది రైతు శ్రీనివాస్‌ను ఆశ్రయిస్తూ విత్తనాలు తీసుకెళ్తున్నారు. అంతే కాదు మన రాష్ట్రం సహా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ర్టాల్లోని రైతులకు విత్తనాలను ఎగుమతి చేస్తున్నాడు. దేశవాళీ విత్తనం అందరికీ చేరాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్న కృషి విజ్ఞాన కేంద్రం వారికి కూడా విత్తనాలు అందజేసి వారి ద్వారా ఎకువ మంది రైతులకు చేరేలా ప్రయత్నం శ్రీనివాస్ చేస్తున్నాడు. శ్రీనివాస్ యొక వ్యవసాయ క్షేత్రంలో జరిగే సాగు వివరాలు, పంట విశేషాలు స్థానిక పత్రికలకు, వ్యవసాయ మన పత్రికలకు పంపి, టెలివిజన్ ద్వారా, న్యూస్ చానల్స్ ద్వారా మరింత మంది రైతులకు చేరేలా చూస్తున్నాడు.
వ్యవసాయం గురించి, వరి పంట గురించి సాంకేతిక సమాచారం తెలిసి ఉండడం వల్ల ప్రస్తుతం మనుగడలో ఉన్న అపురూపమైన దేశవాళీ వరి రకాలు ఎక్కడా కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దేశవాళీ రకాలను బురదలో ఒకే దగ్గర ఎక్కువ సంఖ్యలో నీరు పోసినప్పుడు నీటి ద్వారా గింజలు ఒకరకంతో ఒకటి కలిసి ఇబ్బందులు ఎదురవుతాయని భావించి, ప్లాస్టిక్ ట్రేలలో నారు పెంపకం చేస్తున్నాడు. దీని వల్ల ఎన్ని రకాలైనా ఇబ్బంది లేకుండా నారు పోసుకునే అవకాశం లభించింది. రెండు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు ఉండే ట్రేలలో తాను తయారు చేసిన ఘన జీవామృతం బూడిద సమపాళ్లలలో కలిపి నింపి వరి విత్తులు చల్లి, తర్వాత కొన్ని పద్ధతుల ద్వారా 18-20రోజులకే నారు సిద్ధం చేస్తున్నాడు. ట్రేలలో పెంచడం వల్ల కూలీలు నాటు సులువుగా వేయగలుగుతున్నారు.
గురుమట్టియా వెదురు సన్నాలు, నారాయణ కామిని రకం. ఇది ఇది దొడ్డురకం వరి పంట. ఇందులో అధిక పోషకాలు, పీచు పదార్థాలు కలిగి ఉంటాయి. రక్తపాలి. ఇది ఎరుపు రంగుగా ఉండి మధ్యస్థ సైజులో బియ్యం ఉంటాయి. ఆయుర్వేదంలో వాతం, పిత్తం, కఫం నివారణకు వాడతారని, మూడు వేల సంవత్సరాల కన్నా ఎకువ కాలం నాటిది అని చెప్పబడినది. కాలా చంపా. ఈ బియ్యం నలుపు రంగులో పొడుగుగా ఉంటాయి. అధిక దిగుబడి ఇస్తాయి. పంచరత్న. ఈ బియ్యం ఎరుపు రంగులో సన్నంగా ఉంటాయి. ఇందులో అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. చికిలాకోయిలా.
ఇవి ఎరుపుగా సన్నగా ఉంటాయి. ఇవి తింటే కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మైసూర్ మల్లిగా, నల్ల ముచ్చులు, ఘని, బహురూపీ, కుజిపాటలియా, మాపీలై సాంబా, పుంగార్, కుళాకార్, సిద్ధ సన్నాలు, కాలభల్, తైవాస్ బ్లాక్, రత్నచోడి, యురినికైమా, నాసర్ బత్తా, రాజముడి, రమ్యగళి, కర్సుకాని, సన్న జాజులు, నవారా, ఇల్లపు పంట కరిగి జావళి, ముడిమురంగి, కెంపు నిన్నాలు, కుంకుమపాలి, ఇంద్రాణి, సుగంది, మల్లిపూల్, బాసుమతి, బాస్ బోగ్, నికో, జీరగ సాంబా, తులసీబాసో, రాధాజిగేల్, కాకిరెకలు, కామిని బొగ్, గంధపాలె, చిట్టి ముత్యాలు, పరిమళ సన్న జీదా పూల్, జీరా శంకర్, కృష్ణ బోగ్, గంధ సాలి, కబీర్ బోగ్, రధునీ పాగల్, రాంజీరా, టికి మిశ్రి, సమేళి బోగ్ , మోహన్ బోగ్ రకం విత్తనాలను వృద్ధి చేస్తున్నాడు.
మాది రైతు కుటుంబం. మా నాన్న వివిధ రకాల వరి సాగు చేస్తుండేవాడు. నాన్న చేసే పనులు చూసి నాకు కూడా ఇష్టం ఏర్పడింది. ఈ క్రమంలోనే వ్యవసాయ పాలిటెక్నిక్‌ను పూర్తి చేసుకున్న. నాకు ఇష్టమైన వ్యవసాయ శాఖలోనే ఉద్యోగాన్ని సాధించా. ఉద్యోగం వచ్చిన తర్వాత నా మూడెకరాల వ్యవసాయ క్షేత్రాన్ని దేశీయ వరి వంగడాల పరిరక్షణకు ఉపయోగిస్తున్నా. మొదట ఐదు దేశీయ రకాలను సాగు చేయడం మొదలు పెట్టి ఇప్పుడు 300 రకాల దాకా సాగు చేసే స్థాయికి ఎదిగా. నా దగ్గర నుంచి విత్తనాలు తెలంగాణలోని పలు జిల్లాల రైతులతో పాటుగా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ర్టాల్లోని రైతులకు అందిస్తున్నా. దేశీయ రకాలన్నీ సజీవంగా ఉండాలన్నదే నా లక్ష్యం. వాటి ప్రయోజనాలు అందరికీ అందాలన్నదే నా ఆకాంక్ష.
– యాదగిరి శ్రీనివాస్, ఏఈవో కమాన్‌పూర్, పెద్దపల్లి జిల్లా.