కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్‌పై ఉత్కంఠ కొనసాగుతున్నది. సోమవారం ఉదయం కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో లెక్కింపు ప్రక్రియ మొదలు కాగా, రాత్రి 10గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితం వెల్లడైంది. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించగా.. పట్టభద్రుల రిజల్ట్‌పై మాత్రం టెన్షన్ నెలకొన్నది. క్షణం క్షణం మారుతున్న పరిణామాలు, చెల్లుబాటు కాని ఓట్లు.. మొదటి ప్రాధాన్యతలో ఎవరూ గెలిచే అవకాశాలు లేకపోవడం ప్రధాన అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతున్నది. ఓట్లు ఎక్కువ ఉన్నందున లెక్కింపు ఆలస్యం కాగా, నేడు గెలుపెవరిదో తేలనున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 3 : పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ గత నెల 27న ముగిసింది. కౌంటింగ్ సోమవారం ఉదయం 8గంటలకు కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో మొదలైంది. రాత్రి 10గంటల వరకు టీచర్ ఎమ్మెల్సీ ఫలితం వెలువడగా, బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు విజయం దక్కింది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌటింగ్ మాత్రం టెన్షన్ టెన్షన్‌గా కొనసాగుతున్నది. గెలుపు ధీమాతో ఉన్న అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. అందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మొత్తం 2,58,328 ఓట్లు పోలు కాగా, వీటిని ఉదయం నుంచి లెక్కిస్తున్నారు.
అందుకోసం 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు 24 బ్యాలెట్ బాక్సుల చొప్పున కేటాయిస్తూ వస్తున్నా రు. ముందుగా ఒక్కో బ్యాలెట్ బాక్సులోని బ్యాలెట్ పేపర్లు బయటకు తీసి వాటిలో చెల్లని, చెల్లుబాటయ్యే ఓట్లుగా విభజిస్తున్నారు. చెల్లుబాటయ్యే బ్యాలెట్ పేపర్లను ప్రతి 25 పేపర్లకు ఒక బెండల్గా చేసి, అభ్యర్థుల కు కేటాయించిన బాక్సుల్లో వేస్తున్నారు. నిజానికి రెండు స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కోసం కౌటింగ్ కేంద్రంలో మొత్తం 35 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అందు లో 21 పట్టభద్రుల స్థానం కోసం, 14 ఉపాధ్యాయ స్థానం కోసం ఏర్పాటు చేశారు.
పట్టభద్రుల స్థానంలో చెల్లని ఓట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతూ వస్తున్నది. గెలుస్తామనే ధీమాతో ఉన్న ముగ్గురు అభ్యర్థులకు చెల్లని ఓట్లతో ఆందోళన మొదలైంది. అయితే ఈ చెల్లని ఓట్లు ఎవరి తలరాతలను మారుస్తాయోనన్న ఆందోళన ప్రధాన అభ్యర్థుల్లో కనిపిస్తున్నది. అలాగే మొదటి ప్రాధాన్యతలోనే తమ గెలుపు ఖరారవుతుందన్న ఆశాభావంతో ఉన్న అభ్యర్థుల ఆశ లు నెరవేరేలా కనిపించడం లేదు. కౌటింగ్కేంద్రాల్లో జరుగుతున్న విభజన సరళిని బట్టి.. చూస్తే రెండో ప్రాధాన్యతకు కచ్చితంగా వెళ్లక తప్పద న్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఫలితాలు మంగళవారం వె లువడే అవకాశాలున్నాయి. కాగా, ఎమ్మెల్సీ ఓటింగ్ వేసే పద్ధతిని వివరించి చెప్పడంలో అధికారులు విఫలమయ్యారంటూ పలువురు స్వతంత్ర అభ్యర్థులు, కౌటింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేయడంతోపాటు విమర్శలు చేశారు. అయితే వీరి ఆరోపణలను అధికారులు కొట్టిపారేశారు. అనేక రకాలుగా అవగాహన కల్పించామని చెప్పారు. కాగా, కౌటింగ్ కేంద్రం వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేయవద్దని ముందుగానే హెచ్చరించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో కౌటింగ్ ప్రక్రియ సజావుగానే సాగుతున్నది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కొమురయ్య
కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్కకొమురయ్య విజయం సాధించారు. సమీప పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డిపై గెలుపొందారు. కొమురయ్యకే విజ య అవకాశాలు ఉంటాయని పోలింగ్ ముగిసిన నుంచి అభిప్రాయాలు వ్య క్తమయ్యాయి. అందుకు అనుగుణంగానే ఫలితాలు వెలువడ్డాయి. టీచర్ ఎమ్మె ల్సీ ఎన్నికల్లో మొత్తం 25,041 ఓట్లు పోలు కాగా, అందులో 897 ఓట్లు చెల్లకుండా పోయా యి. 24,144 ఓట్లు చెల్లుబాటు కాగా, అందు లో కొమురయ్యకు 12,959 ఓట్లు, మహేందర్‌రెడ్డికి 7.182ఓట్లు వచ్చాయి. అలాగే అశోక్‌కుమార్‌కు 2,621 ఓట్లు వచ్చాయి.