రోళ్ల వాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తారా.. చేయరా, కళకళలాడాల్సిన రోళ్ల వాగు నీళ్లు లేక ఎండిపోయిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్ల వాగు ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రోళ్ల వాగు పూర్తి చేస్తుందా..? చేయదా? అనే విషయం చెప్పాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు కావస్తోంది. రోళ్లవాగు ప్రాజెక్టు పనులు 95 శాతం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఒక షెట్టర్ ఏర్పాటు చేయడం ఒక్కటే మిగిలింది. అది పూర్తయితే ప్రాజెక్టు కింద ఉన్న బీర్పూర్, ధర్మపురి మండలాల్లో అనేక గ్రామాల్లో పుష్కలంగా నీళ్లు వచ్చే అవకాశం ఉంది’ అని అన్నారు.
‘15 నెలల్లో ఒక ప్రాజెక్టుకు ఒక షెట్టర్ పెట్టడానికి చొరవ తీసుకోని ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. ఇది అవగాహన లేని ప్రభుత్వం’ అని అన్నారు. రోళ్ల వాగు ప్రాజెక్టు విషయమై గతంలో ఏండ్ల తరబడి మంత్రులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు జీవన్ రెడ్డి, రత్నాకర్ రావు ఆలోచన చేయలేదని గుర్తుచేశారు. ‘ఇదంతా టేలెంట్ ప్రాంతం గోదావరి ఒడ్డున ఉన్న పరివాహక గ్రామాలకు నీళ్ళు అందే పరిస్థితి లేదు. తెలంగాణ ఏర్పాటైన తరువాత కేసీఆర్ నాయకత్వంలో ప్రాజెక్టుల పునరుద్ధరణ జరగాలని నిర్ణయించారు. నీళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని ఆ నీళ్ళను ఒడిసి పట్టి ఆ ప్రాంత రైతులకు అందించాలని గొప్ప లక్ష్యంతో తీసుకున్న గొప్ప నిర్ణయం ఈ రోళ్ళ వాగు ప్రాజెక్టు. 2017 ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాం. ఆనాడు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నీటి పారుదలశాఖ మంత్రిగా హరీష్ రావు ధర్మపురి ప్రాంతంలో 9 వేల ఎకరాలు, బీర్పూర్లో ఆరు వేల ఎకరాలకు నీళ్ళు అందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించింది’ అని చెప్పారు.
‘ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలి. దీనికి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 850 ఎకరాల భూమి అటవీశాఖకు చూపింది. కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పని చేస్తుందని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాట్లాడిండు. ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పాలి. ప్రాజెక్టు నిర్మాణం ఎలా జరుగుతుంది. దాని వ్యయం ఎంత? స్థల సేకరణకు రూ.60 కోట్ల నుండి రూ.136 కోట్ల అంచనాలు ఎందుకు పెరిగింది? ఈ అంశాలపై ఎప్పుడైనా సమీక్షించావా..?’ అని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.