వెల్గటూర్, జూన్ 21 : స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎండపెల్లి మండలం రాజారంపల్లిలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో శనివారం తన అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కొప్పుల మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 420 మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
ఈ ఎన్నికల్లో ప్రజల్లో బీఆర్ఎస్ బలమేంటో ప్రతిపక్షాలకు చూపెట్టాలన్నారు. ధర్మపురి ఎమ్మెల్యేగా గెలిస్తే 100 రోజుల్లో ఏదో చేస్తామని ప్రజలను మభ్యపెట్టారని, ఇప్పటికైనా చేసి చూపిస్తే సంతోషిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి పూర్తిస్థాయిలో కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయదుందుబి మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.
అలాగే, బీఆర్ఎస్లో పదవులను అనుభవించి పార్టీని వదిలి వెళ్లిన వారిని ఎట్టిపరిస్థితుల్లో మళ్లీ పార్టీలోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ నాయకులు రమణారావ్, అయ్యోరి రాజేశ్‌కుమార్, రాంచందర్ పాల్గొన్నారు.