BRSV | సిరిసిల్ల టౌన్, జూన్ 14: పదో తరగతి పాఠ్యాంశంగా ఉన్న తెలంగాణ ఉద్యమ చరిత్రను తీసివేడయం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ విమర్శించారు. దీనికి నిరసనగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి శనివారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు అందించకుండా చేయడం రేవంత్రెడ్డి అవివేకానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. దశాబ్దాల కాలం పాటు అనేక రంగాల్లో అణచివేత, దోపిడికి గురై ఎన్నో ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర చరిత్రను రాబోవు తరానికి తెలియజేయడం మనందరి బాధ్యత అని గుర్తుచేశారు. ఉద్యమ చరిత్రను తుడిచి వేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విదానం దుర్మార్గంగా ఉందన్నారు. ఉద్యమ చరిత్రలో ఎక్కడా లేని రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. చరిత్రను ఎవరు వక్రీకరించలేరని, కాంగ్రెస్ ఎప్పటికీ ప్రజల దృష్టిలో దోషిగానే నిలిచిపోతుందన్నారు.
పాఠ్యాంశం తొలగింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇంచార్జి ఎస్ కె. బాబా, మెట్టల సాయి, దీపక్, వలబోజు వెంకటరమణ, అశ్వక్, భరత్, విజయ్, తదితర నాయకులు పాల్గొన్నారు.