జమ్మికుంట, అక్టోబర్ 22: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. నోటిఫికేషన్ రాక ముందు నుంచే బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మండలంలోని ప్రతి గ్రామంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలను నేరుగా కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాలు, పట్టణమంతా ప్రతిరోజూ కలియతిరుగుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ప్రతిపక్షాల పార్టీలు తమ అభ్యర్థులనే ప్రకటించలేదు. ఇప్పటికే ‘పాడి’ అన్ని వర్గాలను ఒకసారి కలిశారు. అయినా కూడా తన దూకుడును కొనసాగిస్తున్నారు. దీంతో కౌశిక్‌రెడ్డి ప్రచారం ముందు ప్రతిపక్షాలు బేజారులో ఉన్నాయని సర్వత్రా చర్చ సాగుతున్నది.
పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో వాడవాడనా భక్తులు గణనాథుడి విగ్రహాలను నెలకొల్పారు. దీన్ని గుర్తించిన మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి, ప్రతి వినాయక మండపం వద్దకు వెళ్లారు. నిర్వాహకులకు కలిశారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆయా నిర్వాహకులు, అర్చకులతో ఆశీర్వచనాలు తీసుకున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో అన్ని దుర్గామాత మండపాలను బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో, స్వరాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులైన బీజేపీ, కాంగ్రెస్, పలు కుల సంఘాల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇటీవల పాపక్కపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, మడిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, గౌడ సంఘం అధ్యక్షుడు కొండపాక రమేశ్, సంఘం నాయకులు, సభ్యులంతా పాడి కౌశిక్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లోకి వచ్చారు. అంతేకాకుండా ఉద్యమకారులు, ఈటల ప్రధాన అనుచరులు, బీజేపీ యువ నాయకులు జువ్వాజీ కుమార్(జేకే), మహ్మద్ జానీ ఆధ్వర్యంలో వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలకు చెందిన వంద మంది గులాబీ గూటికి చేరారు.
రానున్న ఎన్నికల సందర్భంగా ప్రతి నాయకుడు, కార్యకర్తను కలిసేందుకు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(వీణవంక ప్రధాన రోడ్డు, రిలయన్స్ పక్కన)ముందు ఎకరం స్థలం, మూడు అంతస్థుల భవనాన్ని పాడి కౌశిక్‌రెడ్డి ఇటీవల అద్దెకు తీసుకున్నారు. వాహనాలు నిలుపుకొనేందుకు స్థలాన్ని చదును చేయించారు. వందల మందితో నిత్యం సమావేశమయ్యేలా హాల్, స్థలం రెడీ అయ్యింది. రాత్రుళ్లు, పొద్దంతా పార్టీ కార్యాలయానికి వచ్చే ప్రజలు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కార్యాలయం ఈ నెల 27న ప్రారంభించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.