Ramagundam Baldia | కోల్ సిటీ, డిసెంబర్ 4: రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో కారణం తెలియదు కానీ కీలకమైన ఇంజనీరింగ్ విభాగం ప్రక్షాళన జరిగింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ సెక్షన్ ను గురువారం మార్పు చేశారు. నగరపాలక కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో మూలన కార్యకలాపాలు సాగిస్తున్న ఇంజనీరింగ్ సెక్షన్ ను ఉన్నఫలంగా ప్రక్షాళన చేసి గతంలో సివిల్ జడ్జి కోర్టు కార్యకలాపాలు నిర్వహించిన చాంబర్లోకి తరలించారు.
కాగా గత కొద్ది రోజులుగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కాంట్రాక్టర్లపై పలు విధాలుగా ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నాయి. ఐతే గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కడో మూలన ఇంజనీరింగ్ సెక్షన్ కార్యాలయం ఉన్నదనేది ఎవరికీ తెలియకుండా ఉండేది. అక్కడ కాంట్రాక్టర్లు, అధికారులకు మధ్య ప్రతి రోజూ మంతనాల వ్యవహారాలు నడుస్తాయని ఆరోపణలు వచ్చేవి. ఐతే ఆ సెక్షన్ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించే పరిస్థితి లేకుండా ఉండేది. అలాగే ఏమైనా సమస్యలపై స్థానికులు ఇంజనీరింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడానికి కార్యాలయంకు వచ్చినా అక్కడకు వెళ్లడానికి ఇబ్బందులు పడేవారు.
ఉన్నతాధికారులు సైతం ఆకస్మిక తనిఖీలకు వచ్చిన సమయాల్లో ఇంజనీరింగ్ సెక్షన్ ద్రుష్టి లో పడకుండా ఉండేది. ఈ నేపథ్యంలో బుధవారం కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులతో అదనపు కలెక్టర్ అరుణ శ్రీ సమీక్ష సమావేశం నిర్వహించిన మరుసటి రోజునే గురువారం ఇంజనీరింగ్ సెక్షన్ ను హఠాత్తుగా మార్పు చేశారు. కార్యాలయంలో సూపరింటెండెంట్ గది ప్రక్కన చాంబర్లోకి తరలించగా, కీలకమైన ఇంజనీరింగ్ సెక్షన్ లో ప్రక్షాళన దిశగా చేపట్టిన ఈ చర్యలతో ఇకనైనా పనితీరు మెరుగుపడుతుందని పలువురు భావిస్తున్నారు.