Veenavanka | వీణవంక, డిసెంబర్ 11: పంచాయితీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎంపీడీవో మెరుగు శ్రీధర్ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక శ్రీ లక్ష్మీగణపతి ఫంక్షన్ హాల్లో ఎంపీడీవో మెరుగు శ్రీధర్ ఆధ్వర్యంలో సర్పంచ్, వార్డుమెంబర్ అభ్యర్థులకు ఎన్నికల నిర్వహణపై గురువారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభలు, సమావేశాలు, ఊరేగింపులకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని, ప్రచారం కోసం నిర్దేశించిన పరిమితి మేరకు మాత్రమే ఖర్చు చేయాలని, ఖర్చులకు సంబంధించిన లెక్కలు చూపాలని తెలిపారు. సోషల్ మీడియాలో ద్వేషపూరిత పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం ముగించాలన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని, శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అనుపమరావు, ఎస్సైఐ ఆవుల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.