రాజన్న సిరిసిల్ల, జూన్ 6 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకుపై గులాబీ జెండా ఎగిరింది. 12 స్థానాల్లో ఎనిమిది కైవసం చేసుకుని సత్తా చాటింది. ఐదేళ్లకోసారి జరిగే పాలకవర్గ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పట్టు కోసం విశ్వప్రయత్నం చేసినా బీఆర్ఎస్ విజయదందుభి మోగించింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన పార్టీ మూడోసారి హ్యాట్రిక్ సాధించింది. ఎనిమిది స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు, కాంగ్రెస్ 1, బీజేపీ 1, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచారు.
ఇండిపెండెంట్లలో గుడ్ల సత్యానందం బీఆర్ఎస్లో చేరగా, బీఆర్ఎస్ మద్దతుదారుల సంఖ్య 9కి చేరింది. నేడు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనున్నది. కాగా, అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహం ఫలించింది. ఎన్నికల ముందు రెండు రోజులుగా ఓటర్లకు స్వయంగా ఫోన్ చేసి పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రామన్న చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటర్లు బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ డబ్బులతో ఓట్లు కొనేందుకు చేసిన కుట్రలకు ఓటర్లు చెక్‌పెట్టి బీఆర్ఎస్కే పట్టంగట్టారు. పలువురు అభ్యర్థులు మందు, విందు, ఓటుకు నోటు భారీగా పంచి పెట్టారు. అయినా ఓటర్లకు ఎన్నిరకాలుగా ఎరచూపినా కూడా? వారి మాయలో పడకుండా బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేసి రామన్నపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కాగా, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినందుకు కేటీఆర్ ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అభ్యర్థులు గెలిచిన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.