MLA MAKKAN SINGH | కోల్ సిటీ , ఏప్రిల్ 30: రామగుండం నగర పాలక సంస్థ 33వ డివిజన్ పరిధి పరశురాంనగర్ లో పరశురాముడి జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై పరశురాముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షయ తృతీయ సందర్భంగా పరశురాముడి జయంతి జరుపుకోవడం ఆనవాయితీ అని, మహా విష్ణువు అరవ అవతారం పరశురాముడు చాలా క్రోధ స్వభావి అని, సృష్టి చివరి వరకు భూమిపై అమరుడిగా ఉంటాడని పేర్కొన్నారు. రాముడుగా ఉన్న ఆయనకు మహదేవ్ ఆయుధ కళ నేర్పిన తర్వాత శివుడు సంతోషించి గొడ్డలి ఇవ్వడంతో పరశురాముడిగా అవతరించాడని అన్నారు.
ఆ మహనీయుడి పేరుతో ఉన్న పరశురాంనగర్ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని బస్తీ ప్రజలకు హామీ ఇచ్చారు. డివిజన్ ఇన్ఛార్జి బండి రాము ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బొంతల రాజేష్, ఎండీ ముస్తఫా, పెద్దెల్లి తేజస్వి ప్రకాశ్, బస్తీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.