జగిత్యాల రూరల్, డిసెంబర్ 31 : జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారులో న్యాక్ సెంటర్ ఉన్నది. ఇక్కడ వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో 100 మంది విద్యార్థినీ విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. అయితే సమీపంలో ఉన్న డంప్యార్డ్తో అవస్థలు పడుతున్నారు. జగిత్యాల పట్టణంలో సేకరించిన చెత్తను ఇక్కడకు తెచ్చి కాలుస్తుండడంతో పొగ వ్యాపించి గొంతు, శ్వాస కోశ ఇబ్బందులకు గురవుతున్నారు. పదిహేను రోజుల క్రితం ఇద్దరు విద్యార్థులు అస్వస్థత చెంది, ఏరియా దవాఖానలో చికిత్స పొందారు. అయినా పట్టించుకునేవారు కరువయ్యారు. చెత్త నుంచి ఎరువును తయారు చేయాల్సి ఉన్నా ఎవరూ దృష్టి పెట్టడం లేదని న్యాక్ సెంటర్ సిబ్బంది చెబుతున్నారు. పది రోజుల క్రితం న్యాక్సెంటర్ సమీపంలో ఉన్న నూకపల్లి డబుల్ బెడ్రూం ఇండ్ల వద్దకు వచ్చిన కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి, త్వరలోనే డంప్ యార్డు మరోచోటకు మారుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
శాశ్వత పరిష్కారం చూపాలి
న్యాక్ సమీపంలో డంప్యార్డ్తో మేం ఇబ్బంది పడుతున్నాం. చెత్త కాల్చినప్పుడల్లా చాలా దుర్వాసన వస్తున్నది. ఉదయం, సాయంత్రం మొత్తం పొగ వ్యాపిస్తున్నది. ఒకరికొకరు కనిపించని పరిస్థితి ఉన్నది. శ్వాస సమస్యలు కూడా వస్తున్నాయి. విద్యార్థులతోపాటు డబుల్ బెడ్రూం లబ్ధిదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మేం గతంలో డంప్యార్డ్ తొలగించాలని ధర్నా కూడా చేశాం. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. చెత్త కాల్చిన తర్వాత పొగ రాకుండా మట్టి పోసి చేతులు దులుపుకుంటున్నారు. ఇలా కాకుండా మాకు శాశ్వత పరిష్కారం చూపాలి.
– ఎం సాయికుమార్, సూపర్వైజర్ స్ట్రక్చర్