Godavarikhani | కోల్ సిటీ, డిసెంబర్ 11 : రాష్ట్రంలో వారం రోజుల పాటు ఊహించని చలి ప్రభావం ఉంటుందని ఇటీవలనే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ మేరకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. చలికి తట్టుకోలేక చిన్నా, పెద్ద అందరూ ఇళ్లకే పరిమితమయ్యే దుస్థితి నెలకొంది. ఒంటిపై ఉన్ని దుస్తులు, శరీరమంతా దుప్పటి కప్పుకున్నా చలి వణుకు తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తోంది.
మరి ఇళ్లలో నాలుగు గోడల మధ్య ఉన్న మనమే చలికి ఇంత ఇబ్బంది పడుతుంటే బయట రోడ్ల ప్రక్కన ఉండే యాచకులు, నిరాశ్రయుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచిస్తుంటే మరింత వణుకు పుడుతోంది కదూ.. ఆ ఆలోచనే వచ్చిందే తడవుగా గోదావరిఖనికి చెందిన క్రాంతి కుమార్ వాళ్లకు సాయం చేయాలని తలచాడు.
తన సొంత ఖర్చులతో దుప్పట్లు కొనుగోలు చేశాడు. రామగుండం రైల్వే స్టేషన్ నుంచి మొదలు గోదావరిఖని ప్రైవింక్లయిన్ చౌరస్తా వరకు గడ్డ కట్టే చలిలో రోడ్ల ప్రక్కన తీవ్ర ఇబ్బందులు పడుతున్న సుమారు 50 మంది అనాథలు, వృద్ధులు, యాచకుల వద్దకు గురువారం తెల్లవారు జామున వెళ్లి దుప్పట్లు అందించి చలి నుంచి రక్షించాడు.
నిస్వార్థంతో అంత మందిని చలి నుంచి కాపాడిన క్రాంతి కుమార్ ను శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళతోపాటు పలువురు స్వచ్ఛంద సేవకులు ప్రత్యేకంగా అభినందించారు. ఆ చలిలో దుప్పట్లు అందుకున్న బాధితులు క్రాంతి కుమార్ కు చేతులెత్తి కృతజ్ఞతలు తెలిపారు.