Road Safety Rules | కోరుట్ల, జనవరి 1: వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను తూచ తప్పకుండా పాటించాలని జగిత్యాల జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని టీజీ ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో డిపో మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను గురువారం నిర్వహించారు. ఈసందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రవాణా శాఖ అధికారి ఉద్యోగులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ చేయవద్దని, నిర్దేశించిన వేగాన్ని మించకుండా వాహనాలు నడపాలని తెలిపారు.
ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి డ్రైవరు కృషి చేయాలని తెలిపారు. సరైనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణీకులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలని డీటీవో పేర్కొన్నారు. డిపో మేనేజర్ మాట్లాడుతూ డ్రైవర్ల భద్రత దృష్ట్యా రోడ్డు భద్రత మాసోత్సవాలను ఈనెల 31 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనవరి 2న డ్రైవర్ల కుటుంబాలకు కౌన్సిలింగ్, 6న డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కౌన్సిలింగ్, 7న ఉద్యోగులకు వైద్య పరీక్షలు, 8న నిర్వహణ డే, 22న రక్తదాన శిబిరాల ఏర్పాటు, 24న డ్రైవర్స్ డే, జనవరి 31న సన్మాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సూపరింటెండెంట్ లక్ష్మయ్య, హెడ్ కానిస్టేబుల్ సాగర్, సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.