కరీంనగర్ విద్యానగర్, జూన్ 18: సీనియర్ జనరల్ సర్జన్, ప్రతిమ డీఎంఈ డాక్టర్ చెన్నాడి రవీందర్రావు కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. జిల్లాలో సీనియర్ జనరల్ సర్జన్‌గా పనిచేస్తున్న ఆయన, పేదలకు ఉచితంగా చికిత్స అందిస్తూ మన్ననలు పొందారు. ఆయన మృతికి హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం ప్రకటించారు.
1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో తనతోబాటు చాలా మందిని మిసా చట్టం కింద చంచల్‌గూడ జైలులో నిర్భంధించినప్పుడు రవీందర్ రావు జైలు డాక్టర్‌గా సేవలందించారని గుర్తు చేశారు. ఆయన మృతికి కరీంనగర్‌లోని సీనియర్ వైద్యులు ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఎనమల్ల నరేశ్‌తో పాటు ప్రతిమ, చల్మెడ వైద్యులు సంతాపం ప్రకటించారు. ఆయన అంత్యక్రియలను గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెంలో నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.