రాజన్న సిరిసిల్ల, (నమస్తే తెలంగాణ)/ఎల్లారెడ్డిపేట ఆగస్టు 25: గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసి ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న కిష్టారావుపల్లి కార్యదర్శిని పరామర్శించేందుకు వచ్చిన డీపీవో వీరబుచ్చయ్యను శ్రీనివాస్ కుటుంబసభ్యులు నిలదీశారు. ఇందుకు బాధ్యుడైన ఎంపీవో అబ్దుల్ వహీద్‌ను సస్పెండ్ చేయాలని, ఎంపీడీవోను పిలిపించాలని భార్య సరి త డిమాండ్ చేశారు. డీపీవో స్పందిస్తూ విచారణ జరుపుతున్నామని, నివేదిక రాగానే బా ధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శ్రీనివాస్ కుటుంబసభ్యులు శాంతించారు.
9 ఉద్యోగాలు పొందిన శ్రీనివాస్ కార్యదర్శి ఉద్యోగాన్ని వదులుకొనేందుకు ఈనెల 16న కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు కార్యాలయ అధికారులు తెలిపారు. అర్జీని పరిశీలించిన కలెక్టర్ 21న డీపీవోకు ఫార్వర్డ్ చేశారు. దానిని 22న ఇల్లంతకుంట మండల ఎంపీడీవోకు పంపించారు. పంచాయతీ అధికారి నివేదికను ఎంపీడీవో, డీపీవోకు ఇవ్వాల్సి ఉన్నది. ఈ క్రమంలో 23న ఎంక్వయిరీ చేసి నివేదిక రూపొందించారు. వచ్చేనెల 1వ తేదీలోగా శ్రీనివాస్‌ను రిలీవ్ చేయాల్సి ఉండగా, 24న ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. కాగా నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే రూ. 30వేలు డీపీవో డిమాండ్ చేసినట్లు శ్రీనివాస్ భార్య విలేకరుల ఎదుట ఆరోపించింది. శ్రీనివాస్ మాత్రం ఎంపీవో లంచమివ్వాలని ఇబ్బందిపెట్టాడని, కులం పేరుతో దూషించినట్లు వాంగ్మూలంలో చెప్పినట్లు తెలిసింది.
ఈ ఘటనపై కలెక్టర్ విచారణకు అధికారులను ఆదేశించడంతో యంత్రాంగం రంగంలోకి దిగింది. ఎంపీడీవో, ఎంపీవో, కార్యదర్శి మధ్య జరిగిన వివాదంపై విచారణ చేపట్టారు. ఈక్రమంలో డీపీవో, దవాఖానలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు ఎంపీడీవో, ఎంపీవోలపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీనివాస్ ఆత్మహత్యా యత్నానికి గల కారణాలపై ఉన్నతాధికారులు వేగంగా విచారిస్తున్నారు. రెండు రోజుల్లో చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించనున్నారు.