Drinking water | పెద్దపల్లి, మే 07: జిల్లాలో ఎక్కడ కూడా తాగు నీటికి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ వేసవి కాలంలో తాగు నీటి సరఫరా పై అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ తో కలిసి సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా మాట్లాడుతూ.. మిషన్ భగీరథ సోర్స్ గా తాగు నీటి సరఫరా చేయాలని, అనవసరంగా బోర్లు వేయవద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇతర నీటి వనరుల పై ఆధారపడాలని అన్నారు. తాగు నీటి కోసం పంచాయతీ వద్ద అందుబాటులో ఉన్న నిధుల అత్యవసరంగా వాడుకోవాలని అన్నారు. వేసవి కాలంలో ఎక్కడా తాగు నీటి సరఫరా కొరత రాకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.
ఎంపీడీవోలు సమస్యలు వచ్చిన వెంటనే మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతీ ఇంటికి తాగునీటి సరఫరా తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ గ్రీడ్ ఈఈ పూర్ణ చందర్ రావు, ఇంట్రా ఈఈ గంగాధర శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.