జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా సాగుతున్న అబార్షన్ల రాకెట్‌పై పోస్ట్‌మార్టం కొనసాగుతున్నది. భూణహత్యలపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించగా, యంత్రాంగం కదులుతున్నది. ప్రభుత్వంతోపాటు కలెక్టర్ పమేలా సత్పతి సీరియస్ కావడంతో డీఎంహెచ్‌వో సుజాత రంగంలోకి దిగి, ఇప్పటికే హుజూరాబాద్‌లోని మాధవి నర్సింగ్‌హోంను సీజ్ చేయడంతోపాటు రిజిష్ర్టేషన్ రద్దు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ‘అబార్షన్ల రాకెట్లో ఆ ఇద్దరు మహిళా డాక్టర్లే కీలకం!’ అనే శీర్షికన ఈ నెల 12న కథనం ప్రచురితం కావడం కలకలం రేపింది.
హుజూరాబాద్ డివిజన్లోని ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్లే సూత్రదారులన్న విషయాన్ని బహిర్గతం చేయగా, ఈ కథనం సంచలనం సృష్టించింది. కలెక్టర్ ఆదేశాలతో హుజూరాబాద్ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌కు డీఎంహెచ్‌వో నోటీస్ జారీ చేయడంతోపాటు పూర్తి వివరణ కోరారు. ఆ మేరకు సూపరింటెండెంట్ పూర్తి నివేదికను సమర్పించగా.. అందులో పూర్తి స్థాయిలో నిజానిజాలను పొందపరచలేదని తెలుస్తున్నది. అయితే మరింత లోతుగా వెళ్తేనే రాకెట్‌కు అడ్డుకట్ట పడనున్నది.
కరీంనగర్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా సాగుతున్న అబార్షన్లు, అందుకు ఉపయోగిస్తున్న డ్రగ్స్, ప్రధానపాత్ర పోషిస్తున్న పలు దవాఖానలు, పాత్రదారులు, సూత్రదారులు వంటి వివరాలతో ‘నమస్తే తెలంగాణ’ నాలుగు రోజుల పాటు వరుస కథనాలను ప్రచురించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ముందుగా హుస్నాబాద్ పోలీసులు స్పందించి హుజూరాబాద్‌లోని మాధవి నర్సింగ్ నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన విషయం కూడా విదితమే.
హుస్నాబాద్ పోలీసులు స్పందిస్తున్నా జిల్లా వైద్యోరోగ్యశాఖ మొద్దు నిద్ర పోతున్న విషయాన్ని సైతం ‘నమస్తే’ వెలుగులోకి తేవడంతో ఈ వ్యవహారంపై కలెక్టర్ సీరియస్ ఆయ్యారు. దీంతో డీఎంహెచ్‌వో స్పందించి, ఎట్టకేలకు కార్యాలయం నుంచి కదిలారు. ఈ నెల 12న కలెక్టర్ ఆదేశాలతో హుజూరాబాద్‌లోని మాధవి నర్సింగ్‌హోంను సీజ్ చేయడంతోపాటు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో ‘అబార్షన్ల రాకెట్లో ఆ ఇద్దరు మహిళా డాక్టర్లే కీలకం’ శీర్షికన కథనం ప్రచురితం కావడం, అందులో అనేక అంశాలను బయటపెట్టడంతో కలెక్టర్ మరోసారి ఫైర్ అయ్యారు. దీంతో జిల్లా వైద్యాధికారి హుజూరాబాద్ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌కు నోటీసు జారీ చేసి.. ఆ ఇద్దరు మహిళా డాక్టర్లపై పూర్తి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.
సూపరింటెండెంట్ పూర్తి వివరాలతో వైద్య ఆరోగ్యశాఖకు తాజాగా ఒక నివేదిక సమర్పించారు. హుజూరాబాద్ ఏరియా దవాఖానలో మొత్తం ఐదుగురు గైనకాలజిస్టులు ఉన్నట్టు పేర్కొన్నారు. అందులో వైద్యులు జే సోమశేఖర్, ఎస్ పల్లవి, వై వాణి లత, ఎం లావణ్య, డీ నాగనందిత పనిచేస్తున్నట్టు నివేదిక ఇచ్చారు. డాక్టర్ ఎం లావణ్య, డాక్టర్ డీ నాగనందితకు హుజూరాబాద్, జమ్మికుంటలో ప్రైవేట్ ప్రాక్టీస్ ఉన్నట్టు స్పష్టం చేశారు.
గతంలో జిల్లా వైద్యారోగ్యాధికారి జమ్మికుంటలో చేసిన దాడుల్లో లావణ్య చట్టవిరుద్ధంగా అబార్షన్లు చేస్తూ పట్టుబడడంతో సస్పెండ్ అయ్యారని, ప్రస్తుతం అమె సస్పెన్షన్‌లో కొనసాగుతున్నారని తెలిపారు. ఇక ఎన్హెచ్ఎం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న నాగనందిత ప్రైవేట్ ప్రాక్టీస్ కలిగి ఉన్నారని, అయితే ఆమె ఇప్పుడు ప్రసూతి సెలవులో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. డాక్టర్లు లావణ్య, నాగనందిత తప్ప ఇతర డాక్టర్లకు ప్రైవేట్ ప్రాక్టిస్తో సంబంధం లేదని సూపరింటెండెంట్ తన నివేదికలో స్పష్టం చేశారు.
డీఎంహెచ్‌వోకు నివేదిక సమర్పించిన ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ పూర్తిస్థాయి నిగ్గు తేల్చలేదని తెలుస్తున్నది. నివేదిక అడిగినందుకు ఇచ్చినట్టుగా ఉన్నదే తప్ప.. అందులో పూర్తిస్థాయిలో నిజానిజాలను పొందుపరచలేదని అర్థమవుతున్నది. నిజానికి డివిజన్లో అబార్షన్ల రాకెట్ నడుపుతున్నదెవరు? అందులో కీలకపాత్ర పోషిస్తున్న ఆ ఇద్దరు మహిళా డాక్టర్లు ఎవరు? ఎన్నాళ్లుగా ఈ దందా సాగుతున్నది? అన్న వివరాలను సైతం నివేదికలో పొందుపరచలేదని తెలిసింది.
అంతేకాదు, తన ఏరియా దవాఖానలో ఐదుగురు గైనకాలజిస్ట్లు పనిచేస్తున్నారని చెప్పిన సూపరింటెండెంట్.. ఇద్దరు ప్రైవేట్ దవాఖానలు నడుపుతున్నట్టు స్పష్టత ఇచ్చారు. పోనీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న ఆ డాక్టర్స్ అబార్షన్స్ చేస్తున్నారా..? లేదా..? అన్నది స్పష్టత ఇవ్వలేదు. అందులో కొన్ని అధికారాలు సూపరింటెండెంట్‌కు లేకపోవచ్చు కానీ, ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకొని లోతుగా వెళ్తే.. రాకెట్ నడిపే డాక్టర్ల గురించి పూర్తిగా తెలిసే అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నివేదిక ఆధారంగా డీఎంహెచ్‌వో విస్తృత చర్యలు తీసుకోవచ్చు. అవసరమైతే ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిజాలను నిగ్గు తేల్చవచ్చు. సూపరింటెండెంట్ తన నివేదికలో ఇద్దరు మహిళా డాక్టర్లు ప్రైవేట్ దవాఖానలు నడుపుతున్నట్టు స్పష్టంగా ఇచ్చిన నేపథ్యంలో డీఎంహెచ్‌వో మరింత ముందుకెళ్లవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమతున్నాయి. ప్రధానంగా గర్భిణుల జాబితా గ్రామాల వారీగా వైద్య ఆరోగ్య శాఖ చేతిలో ఉంటుంది. వాటి ఆధారంగా విచారణ జరిపినా భ్రూణహత్యలు బయటపడే అవకాశాలుంటాయని వైద్యారోగ్యశాఖ అధికారులే చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో డీఎంహెచ్‌వో నివేదికకే పరిమితమవుతారా..? లేక.. మరింత లోతుగా వెళ్తారా..? అన్నది మున్ముందు తేలనున్నది. విచిత్రం ఏమిటంటే అబార్షన్ రాకెట్ నడుపుతున్న ఆ ఇద్దరు మహిళా డాక్టర్ల పేరు క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది నుంచి పై స్థాయివరకు తెలిసినా.. వారిపై చర్యలు తీసుకోకుండా దాటవేస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తున్నది. దీనినే ఆసరాగా చేస్తున్న సదరు మహిళా డాక్టర్లు.. విచ్చలవిడిగా అబార్షన్లు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాకెట్‌కు అడ్డుకట్ట వేయాలంటే మరింత లోతుగా వెళ్లాల్సిన అవసరముందని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు.