కోరుట్ల రూరల్, జూలై 16: ఆయన కుంచె కదిపితే కాన్వాస్‌పై అపురూప చిత్రాలు జాలువారుతాయి. ఆయన వేసిన ఏకరేఖ చిత్రాలు చూడముచ్చటగా ఉంటూ ఇట్టే ఆకట్టుకుంటాయి. అతడి ప్రతిభకు అనేక పురస్కారాలు వరించాయి. చిత్రకారుడిగా, లయన్స్‌క్లబ్ ప్రతినిధిగా సేవా కార్యక్రమాలే కాకుండా న్యాయవాదిగా రాణిస్తున్న చాప కిశోర్‌పై ‘నమస్తే’ ప్రత్యేక కథనం కోరుట్లకు చెందిన చాప కిశోర్‌కు విద్యార్థి దశ నుంచే చిత్రలేఖనం అంటే మక్కువ. కార్టూన్లను గీసి పలు మాసపత్రికలకు పంపేవాడు. అందరూ గీసే బొమ్మలకు భిన్నంగా కొత్త దనం ఉట్టిపడేలా ఏకరేఖ చిత్రాలను గీయడం ఈయన ప్రత్యేకత. కిశోర్ గీసిన చిత్రాల్లో తెలుగుదనం ఉట్టిపడేలా బాపూ బొమ్మవలె ఉంటాయని కళాభిమానులు చెబుతుంటారు.
కొవిడ్ వేళ ఆయన గీసిన కార్టూన్, ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా చిత్రం. 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా కేసీఆర్ చిత్రంతో గోల్కోండ కోటపై జాతీయజెండా మహాత్ముడితో కూడిన చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి. ఈయన వేసిన పెయింటింగ్‌కు తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సేవా సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో యేటా ఇచ్చే మహానంది జాతీయ పురస్కారం అందుకున్నారు. అలాగే ఈయన గీసిన చిత్రం అంతర్జాల మాసపత్రికైన కళా మాధురిలో జనవరి 2023, మార్చి 2023లో అంతర్జాల మాసపత్రికలో కవర్పేజీల్లో ప్రచురితమయ్యాయి. అలాగే లయన్స్‌క్లబ్ అధ్యక్షుడిగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులను పొందారు. 75 గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులను ఏర్పాటు చేసి యువతకు చట్టాలపై అవగాహన కల్పించారు.
బాపు స్ఫూర్తితోనే..
బాపూ గీచిన చిత్రాలతోనే నేను చిత్రలేఖనంపై మక్కువ పెంచుకున్న. తెలుగుదనం ఉట్టిపడేలా పలు చిత్రాలను గీసిన. నేను వేసిన చిత్రాలను బాపుకు పంపగా అభినందించారు. దీంతో నాలో ఆ చిత్రాలను కొత్తదనంతో గీయాలనే ఆలోచనలతో ఏకరూప చిత్రాలను గీయడం ప్రారంభించిన. నేను గీసిన చిత్రాలు బాపూ బొమ్మలకు ప్రతిరూపంలా ఉన్నాయని ప్రముఖులు ప్రశంసించడం ఎంతో ఆనందంగా ఉన్నది.
– చాప కిశోర్