పెద్దపల్లి, జూలై 28(నమస్తే తెలంగాణ)/ తిమ్మాపూర్/ బోయినపల్లి: వరద కొనసాగుతున్నది. ఇటీవల వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో వస్తూనే ఉన్నది. సిద్దిపేట జిల్లాలోని కూడెల్లి, కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ వాగుల పరవళ్లతో గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు మత్తడి దూకుతుండగా, సిరిసిల్ల మానేరు, వేములవాడ మూలవాగుల ఉధృతితో శ్రీ రాజరాజేశ్వర జలాశయం(మధ్యమానేరు) నిండుకుండలా మారింది. నిన్నటిదాకా 1.05లక్షల క్యూసెక్కుల వరద నీరు రాగా, శుక్రవారం సగానికిపైగా తగ్గి, 36,577 క్యూసెక్కులు వస్తున్నది. 27.50 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎస్సారార్ జలాశయంలో ప్రస్తుతం 19.26 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పార్వతీ బరాజ్‌వద్ద ప్రత్యేకాధికారి సంగీత సత్యనారాయణ
మంథని రూరల్, జూలై 28: సిరిపురంలోని పార్వతీ బరాజ్‌ను జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, కలెక్టర్ ముజిమ్ముల్లాఖాన్ శుక్రవారం సందర్శించారు. ఎత్తి పోతల వివరాలను అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి తగిన సూచనలు, సలహాలు చేశారు. బరాజ్‌లోకి 8 లక్షలకు క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తున్నదని, 74గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నట్లు అధికారులు వారికి వివరించారు. గోదావరి పరివాహక ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వారి వెంట ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఎస్ఈ కరుణాకర్, ఈఈ ఓంకార్‌సింగ్, డీఈ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.
ఎల్ఎండీకి గేట్లు ఓపెన్
ఎల్ఎండీకి ఇన్‌ఫ్లో తగ్గింది. మానేరు నుంచి ఆగిపోగా, మోయతుమ్మెద వాగు నుంచి 33,239 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. దీంతో అధికారులు 16గేట్లు ఎత్తి 32వేల క్యూసెక్కుల నీటిని మానేరు నదిలోకి విడుదల చేస్తున్నారు. 24టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎల్ఎండీలో ప్రస్తుతం 22టీఎంసీలు నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఎల్ఎండీ గేట్లను ఇరిగేషన్ అధికారులు నిత్యం పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి స్వయంగా ఎస్ఈ శివకుమార్ పర్యవేక్షిస్తున్నారు.
గోదారి ఉధృతి
ఇతర వాగులు కాస్త శాంతించినా గోదావరి ఉధృతి మాత్రం కొనసాగుతున్నది. అటు కడెం ప్రాజెక్టు, ఇటు ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఉప్పెనలా తరలివస్తున్నది. ఎస్సారెస్పీ నుంచి 3,08,000 క్యూసెక్కుల వరద నీరు, కడెం ప్రాజెక్టు నుంచి 31,180క్యూసెక్కుల వరద, ఇతర వాగులు వంకల నుంచి 5,14,592క్యూసెక్కులు అంటే మొత్తంగా 8,53,772 క్యూసెక్కుల వరద వస్తుండడంతో రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని ఇరిగేషన్ అధికారుల బృందం అక్కడ 48గేట్లను ఎత్తి 9,02,580క్యూసెక్కులను మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బరాజ్‌కు తరలిస్తున్నారు. అక్కడా 77గేట్లు ఎత్తి వచ్చింది వచ్చినట్లే దిగువకు భూపాలపల్లి జిల్లాలోని సరస్వతీ బరాజ్‌కు పంపిస్తున్నారు. కాగా, ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో గోదావరి మహోగ్రంగా ప్రవహిస్తున్నది. గోదావరిఖని, మంచిర్యాల జిల్లాను కలుపుతూ నిర్మించి వంతెన కింద ఉధృతంగా ప్రవహిస్తున్నది. స్థానిక సప్తగిరికాలనీకి వరద నీరు చేరుకోగా, లారీ యార్డు, సమ్మక్క సారమల్మ, గద్దెలు, గోదావరి సమీపంలోని స్నానాల ఘట్టాలు నీటమునిగాయి. మేడిపల్లి ఓసీపీ రహదారిలో వరద నీరు ప్రవహించింది.