Road development | కోల్ సిటీ, మే 23: రామగుండం నగర పాలక సంస్థ నాలుగవ డివిజన్ కృష్ణానగర్ లో సి సి రోడ్లు నిర్మించడానికి రూ 2 కోట్లు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగవ డివిజన్ లో పాత రోడ్లు శిధిలం కావడం , కొత్త కాలనీలు అభివృద్ది చెందుతున్న నేపధ్యంలో ప్రజల సౌకర్యార్ధం సి సి రోడ్లు నిర్మించాలని స్థానిక శాసన సభ్యులు ఎం. ఎస్. రాజ్ ఠాకూర్ రామగుండం నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి , జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు అంచనాలు తయారు చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించగా రామగుండం నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు రూ. 2.00 కోట్ల తో పనులు చేపట్టడానికి అంచనా లు తయారు చేసి సమర్పించారు. ఈ అంచనాలకు జిల్లా కలెక్టర్ ఆమోదం తెలుపడంతో పాటు రూ 2.00 కోట్లు మంజూరు చేస్తూ వెంటనే పనులు చేపట్టడానికి తగు చర్యలు తీసుకోవలసిందిగా రామగుండం నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు . సాధ్యమైనంత త్వరగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ ( ఎఫ్ ఎ సి ) అరుణశ్రీ తెలిపారు.