ధర్మపురి, సెప్టెంబర్ 17: దివ్యాంగుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం 141 మంది దివ్యాంగులకు స్కూటీలు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, బ్యాటరీ ఆపరేటివ్ ట్రైసైకిళ్లను మంత్రి ఈశ్వర్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘తెలంగాణలో దివ్యాంగులకు పింఛన్ ఇస్తున్న మాదిరిగా దేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా?, కనీసం వెయ్యి రూపాయలకు మించి పింఛన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఉన్నదా?, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ వెయ్యి రూపాయలు దాటలేదు గదా…’ అంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో వందశాతం ఉచితంగా మోటారు స్కూటీలు, బ్యాటరీ ట్రైసైకిళ్లను అందజేస్తున్నామన్నారు. ఒక్కో స్కూటీకీ రూ.1.20 లక్షలు వెచ్చించి రిజిస్ట్రేషన్ ఖర్చులతో సహా ప్రభుత్వమే భరించి దివ్యాంగుడికి అందిస్తుందన్నారు. ఒక్కో బ్యాట రీ ఆపరేటెడ్ ట్రైసైకిల్‌కు రూ.42వేలు వెచ్చిస్తున్నామన్నారు. 4జీస్మార్ట్ ఫోన్లను, రూ.40వేల విలు వ గల ల్యాప్‌టాప్‌లను అందజేస్తున్నామన్నారు.
దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే రూ.50వేల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని చెప్పారు. ప్రత్యేకంగా సదరం క్యాంపులు నిర్వహించి దివ్యాంగుల యొక్క వికలాంగత్వ శాతాన్ని గుర్తించి వివిధ రకాల ఉపకరణాలు అందిస్తున్నామని తెపారు. దివ్యాంగులకు ఇంతటి మేలు చేస్తున్న బీఆర్ఎస్ను, ఆర్థిక భరోసా కల్పించిన సీఎం కేసీఆర్‌ను ఎన్నటికీ మరవొద్దని సూచించారు. అనంతరం ముగ్గురు దివ్యాంగులకు ఆర్థిక పునరావాసం పథకం కింద రూ.2.30లక్షల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ నరేశ్, ఎంపీపీలు బాధినేని రాజమణి, ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్, బత్తిని అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్, వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్‌కుమార్ తదితరులున్నారు..
సంవత్సరం క్రితం నా ఎడమ కాలుకు ఇన్ఫెక్షన్ సోకగా డాక్టర్లు కాలును పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి సంక కర్రలతో నడవడానికి ఇబ్బందులు పడుతున్నాను. ఒక సారి మంత్రి ఈశ్వర్ సారును కలిసి పరిస్థితిని వివరించాను. ఆయన స్పందించి నా పేరు రాసుకొని నాకు ఈ రోజు ధర్మపురిలో బ్యాటరీ ట్రై సైకిల్‌ను అందజేసిండు. బ్యాటరీ ట్రైసైకిల్ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. మంత్రి ఈశ్వర్ సారుకు ధన్యవాదాలు.
కొండబత్తిని మల్లయ్య, లక్ష్మీపూర్, గొల్లపెల్లి మండలం
నాకు షుగర్ వ్యాధి సోకి ఎడమకాలుకు పుండై ఇన్ఫెక్షన్ అయింది. దీంతో డాక్టర్లు కుడి కాలును తొలగించారు. మంత్రి ఈశ్వర్ సారును కలిసి నాకు ట్రైసైకిల్‌తో పాటు కృత్రిమ కాలు కావాలని అడిగిన. సారు స్పందించి ఇప్పుడైతే ట్రైసైకిల్ ఇచ్చిండు. కృత్రిమ కాలును కూడా పెట్టిస్తానని మాట ఇచ్చిండు. మంత్రి ఈశ్వర్ సారు సల్లంగా ఉండాలే. బొందిల ప్రాణం ఉన్నంత వరకు నా మద్దతు కేసీఆర్ సారుకు, ఈశ్వర్ సారుకే.
-నరెడ్ల నర్సవ్వ, తుమ్మెనాల, ధర్మపురి మండలం
మా ఇంటి సమీపంలో రెండేళ్ల క్రితం గోడ కూలి నాపై పడింది. ఈ ప్రమాదంలో వెన్నెముక దెబ్బతిని నడుము, కాళ్లు చచ్చుబడ్డాయి. కదలేని స్థితిలో బాధపడుతుండగా తెలంగాణ ప్రభుత్వం ధైర్యాన్నిచ్చింది. బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్ కావాలని మంత్రిని కోరగా ఆయన స్పందించి రూ.45వేల విలువ గల ఆ వాహనాన్ని అందించారు. నెలకు రూ.4,016 పింఛన్ కూడా వస్తున్నది. దివ్యాంగుల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ సారుకు, మంత్రి ఈశ్వర్ సారుకు ధన్యవాదాలు.
– మంతెన రాజశేఖర్, ఎండపెల్లి
నేను ధర్మపురిలో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తాను. దివ్యాంగుడనైన నేను పేషంట్లకు సేవ చేసేందుకు సైకిల్‌పై వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం స్కూటీలు ఇస్తున్నదని తెలిసి మంత్రి ఈశ్వర్ సారును కలిసి స్కూటీ కావాలని అడిగిన. సారు స్పందించి రూ.1.20 లక్షల విలువ గలిగిన స్కూటినీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించి అందించింది. ఇప్పుడు ఓ ఆర్ఎంపీ వైద్యుడిగా పేషంట్లకు సేవ చేసేందుకు స్కూటీపై వెళ్తాను.
– ముత్తునూరి మహేశ్, ధర్మపురి