మానకొండూర్, ఏప్రిల్ 20 : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సుప్రీం ఫంక్షన్హాల్లో గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లింలకు దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముస్లిం మతపెద్దలకు, ముస్లింలకు ఖర్జురా, పండ్లు తినిపించారు. అనంతరం ఆయన తెలంగాణ ప్రభుత్వం తరఫున నిరుపేద ముస్లింలకు ‘రంజాన్ తోఫా’లను పంపిణీ చేశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ముస్లిం ఆడబిడ్డల పెండ్లికి షాదీముబారక్ పథకం కింద రూ. లక్షా 116, ఇమామ్‌లకు గౌరవ వేతనం, మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసించడానికి ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, సర్పంచులు రొడ్డ పృథ్వీరాజ్, రామంచ గోపాల్‌రెడ్డి, ఉపసర్పంచ్ నెల్లి మురళి, బీఆర్ఎస్ నాయకులు ముద్దసాని శ్రీనివాస్‌రెడ్డి, పిట్టల మధు, ఉండింటి శ్యాంసన్, ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, కడారి ప్రభాకర్, ముస్లిం మతపెద్దలు, మసీదు కమిటీ సభ్యులు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.