Karimnagar | తిమ్మాపూర్, మే25 : ఎల్ఎండీ రిజర్వాయర్లో ఉన్న శ్రీ తాపాల లక్ష్మీనృసింహస్వామి గుట్ట చుట్టూ గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు జేసీబీ యంత్రంతో తవ్వకాలు చేపట్టారు. దీంతో రామకృష్ణకాలనీ గ్రామానికి చెందిన రైతుల సమాచారంతో గ్రామస్తులు వెళ్లి సదరు వ్యక్తులను ప్రశ్నించగా పొంతన లేని సమాదానాలు చెప్తూ గొడవకు దిగారు.
తమకు ఇరిగేషన్ అధికారుల అనుమతులున్నాయని ఎదురుతిరిగారు. దీంతో గ్రామస్తులు అధికారులను అడగ్గా.. తామేమీ అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. గ్రామస్తులు గట్టిగా ప్రశ్నించడంతో అక్కడినుండి పరారయ్యారు. గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేపట్టారని, అధికారులు చర్యలు తీసుకోవాలని రామకృష్ణకాలనీకి చెందిన ధావు సంపత్ రెడ్డి, మాచర్ల అంజయ్య, కొమ్మెర మల్లారెడ్డి, గోనెల పర్శరాములు, పలువురు గ్రామస్తులు అధికారులను కోరారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న వారిని బయటకు తీయాలని డిమాండ్ చేశారు.