Farmers | గంగాధర, ఏప్రిల్ 26: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు 32 క్వింటాళ్ల నిబంధన ఇబ్బందులు కలిగిస్తోంది. యాసంగి సీజన్ లో ఒక్కో ఎకరానికి దాదాపు 36 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, ప్రభుత్వం ఎకరానికి 32 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో మిగిలిన ధాన్యం అమ్మడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక రైతుకు ఎకరానికి 36 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, ఆన్లైన్లో ధాన్యం వివరాలు నమోదు చేసే సమయంలో 32 క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటోంది.
దీంతో మిగిలిన 4 క్వింటాలను అమ్మడాని రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన ధాన్యాన్ని అమ్మడానికి ఇతర రైతులను ఆశ్రయించవలసి వస్తోందని వాపోతున్నారు. వర్షాకాలంలో దిగుబడి తక్కువగా వచ్చినా, యేసంగి మాత్రం దిగుబడి ఎక్కువగా వస్తుందని, దిగుబడికి అనుగుణంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల కోరారు. ప్రభుత్వం స్పందించి ఎకరానికి 32 క్వింటాళ్లకు బదులుగా 36 క్వింటాళ్ళు కొనుగోలు చేసి ఇబ్బందులను తీర్చాలని రైతులు కోరుతున్నారు.