Ramagundama Baldia | కోల్ సిటీ, జూన్ 12: ‘ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు’ అన్న సామెత రామగుండం నగర పాలక సంస్థకు చక్కగా సరిపోతుంది. ఇక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు దేవుడెరుగు పైగా అందలం ఎక్కిస్తున్న పరిస్థితి ఉంది. పై అధికారులు సైతం వచ్చామా… వెళ్లామా…? అన్నట్టుగా కార్యాలయంకు వచ్చి కంటితుడుపుగా విచారణ చేపట్టడం మినహా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అంతుచిక్కడం లేదు. ఇందుకు దృష్టాంతమే గత ఫిబ్రవరి 24వ తేదీన పురపాలక సంఘం ప్రాంతీయ సంచాలకులు (ఆర్డీ) షాహీద్ మసూద్ రామగుండం కార్పొరేషన్ కార్యాలయంకు వచ్చి అవకతవకలపై రోజంతా విచారణ జరిపారు. నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. పైగా ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పదోన్నతులు కట్టబెట్టారన్న మరో ఆరోపణ ఉంది. రామగుండం కార్పొరేషన్ ఇంజనీరింగ్, పారిశుధ్య విభాగంలోనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి.
దీనిలో భాగంగా కార్పొరేషన్ లో రూ.2 కోట్లతో కొనుగోలు చేసిన వాహనాలు కార్యాలయంకు రాకముందే బిల్లులు జారీ చేశారన్న ఆరోపణ ఉంది. దీనికి తోడు పారిశుధ్య వాహనాలలో డీజిల్ లోడింగ్‌లో అవకతవకలు జరిగినట్లు 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సుమలత రాజు, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ విజిలెన్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో గత ఫిబ్రవరి 24వ తేదీన వరంగల్ రీజనల్ డైరెక్టర్ షాహీద్ మసూద్ కార్యాలయంకు ఆకస్మికంగా వచ్చి విచారణ చేపట్టిన సంగతి విధితమే. ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు రోజంతా రహస్య విచారణ జరిగింది. ఆ సమయంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులను విచారించగా సరియైన రికార్డులు సమర్పించలేదు. దీనితో ఆర్ డీ అగ్రహం వ్యక్తం చేశారు. అలాగే డీజిల్ లెక్కలకు సంబంధించి రికార్డులను పరిశీలించారు.
ఇది జరిగి దాదాపు 4 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు పురోగతి కనిపించలేదు. పైగా ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారికి అదే విభాగంలో పదోన్నతి కల్పించడం గమనార్హం. విచారణ అనంతరం హైదరాబాద్‌లోని విజిలెన్స్ డీఐజీకి మరోసారి కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ప్రస్తుత రీజనల్ డైరెక్టర్ షాహీద్ మసూద్ 2011లో ఇక్కడే కమిషనర్ గా పని చేసిన అనుభవం ఉంది. కార్యాలయంలోని అన్ని విభాగాలపై ఆయనకు పట్టు ఉంది. దాంతోపాటు స్థానిక అధికారులతో ఉన్న సత్సంబంధాల కారణంగానే ఇక్కడి అధికారులు ఖాతరు లేదని పలువురు చర్చించుకుంటున్నారు. తాజాగా డివిజన్ల విభజనలో తప్పుల తడకపై కూడా బుధవారం కార్యాలయంకు వచ్చిన ఆయన సాధారణంగా మ్యాప్ ల ను పరిశీలించి వెళ్లిపోయారు. దీంతో ఆర్డీ విచారణలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి పురోగతి ఉండటం లేదంటూ పలువురు సిటిజెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.