Ramagundam baldiya | కోల్ సిటీ , జూలై 2: గోదావరిఖని నగర నడిబొడ్డు పోచమ్మ మైదానం ఖాళీ స్థలంలో రాత్రికి రాత్రే వెలిసిన నిర్మాణాల తొలగింపులో రాజకీయ ఒత్తిళ్లకు రామగుండం కార్పొరేషన్ అధికారులు ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు. ‘నగరంలో రాత్రికి రాత్రే నిర్మాణాలు’ శీర్షికన ‘నమస్తేతెలంగాణ’లో ప్రచురితమైన వరుస కథనాల నేపథ్యంలో అధికారులు దిగివచ్చి గత నెల 28న అక్కడి నిర్మాణాలను ఎక్స్కవేటర్ తో నేలమట్టం చేశారు. దాదాపు 12 దుకాణాలను అనుమతులు లేని కారణంగా అధికారులు కూల్చివేశారు. అక్కడ పూర్తి స్థాయిలో తొలగించకుండా చివరి వరుసలో గల మూడు గదులను మాత్రం వదిలిపెట్టారు.
ఇక్కడే అధికారుల వెనుకడుగుపై పలువురు అనేక విధాలుగా చర్చించుకుంటున్నారు. కూల్చివేసిన ఆ దుకాణాల పక్కనే ఉన్న మరో మూడు నిర్మాణాలు మాత్రం ఎందుకు వదిలిపెట్టారనేది అంతు చిక్కడం లేదని వాపోతున్నారు. కేవలం రాజకీయ నాయకుల పలుకుబడి ఉండటం వల్లే వాటికి మినహాయింపు ఇచ్చారా..? అని పలువురు బాధితులు ప్రశ్నిస్తున్నారు. దుకాణాల కూల్చివేత సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమను ఇక్కడ కట్టుకోమంటేనే కట్టుకున్నామని బాధితులు బాహాటంగానే తమ గోడును వెల్లబోసుకున్నారు. అదే స్థలంలో తమతో పాటే నిర్మించుకున్న వాటిలో మిగతావి మాత్రం తొలగించక పోగా, మళ్లీ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతుండటం పట్ల అటు బాధితులు, ఇటు స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయమై నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ ను వివరణ కోరగా, అక్కడ చేపట్టిన నిర్మాణాల్లో ఏ ఒక్కటికీ అనుమతి లేదనీ, చివరి షెట్టర్లలో సిమెంట్ బస్తాలు ఉండటం వల్ల ఒకరోజు గడువు ఇచ్చామనీ, త్వరలో వాటిని కూడా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, రాజకీయ ఒత్తిళ్లకు టౌన్ ప్లానింగ్ అధికారులు తలొగ్గిన కారణంగానే వాటి విషయంలో చర్యలకు సాహసం చేయడం లేదని స్థానికంగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది.