Collector Koya Sri Harsha | పెద్దపల్లి, జూలై24: సీజనల్ వ్యాధి లక్షణాలున్న ప్రతీ ఒక్కరికీ తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుష్ ఆసుపత్రిని, నూతనంగా నిర్మాణం జరుగుతున్న 100 పడకల ఆసుపత్రి పనులు, క్యాజువాలిటీని పరిశీలించి సూచనలు చేశారు. ఆసుపత్రి వెనుక సందు విస్తరించి అక్కడి నుంచి పేషెంట్ తరలింపు చర్యలు తీసుకోవాలన్నారు.
సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. తనీఖీలలో కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్ఎంవో డాక్టర్ విజయ్, నర్సింగ్ సూపరింటెండెంట్ జమున సంబంధిత అధికారులు తదితరులున్నారు.