కరీంనగర్ రూరల్: జూన్ 14 : మనిషికి ఆరోగ్యమే ముఖ్యమని, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు జీవనశైలి మార్చుకోవాలని తెలంగాణ రీసెర్చ్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ డీసీ తిరుపతిరావు సూచించారు. కరీంనగర్ మండలం నగునూర్‌లోని ప్రతిమ వైద్య కళాశాల ఆడిటోరియంలో ఆదివారం ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ, తెలంగాణ రీసెర్చ్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా సంయుక్తంగా ఏర్పాటు చేసిన సీఎంఈ కార్యక్రమం ‘పంచమ్-2026 డయాబెటిస్ వైద్య శాస్త్రీయ సదస్సు’ను ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సదస్సులో ఢిల్లీ, హెదరాబాద్తోపాటు వివిధ ప్రాంతాల నుంచి అనుభవజ్ఞులైన వైద్యులు వచ్చి డయాబెటిస్‌పై నూతన శాస్త్రీయ విధానాలు, రీసెర్చ్ చేసిన వివరాలు, డాక్టర్‌కు వచ్చిన సందేహాలను వివరించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ, డయాబెటిస్‌పై ఆధునిక వైద్య ఆలోచన విధానం పెంపొందించేందుకు తెలంగాణ రీసెర్చ్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా ఆధ్వర్యంలో ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
వ్యాధిగ్రస్తుల జీవన శైలిలో మార్పులు రావాలని, నిత్యం శారీరక వ్యాయామం, వాకింగ్ చేయాలని, జంక్‌ఫుడ్, బయట ఫుడ్ మానివేయాలని, నాన్‌వెజ్ అలవాట్లు తగ్గించాలని, ప్రతి రోజూ సరైన సమయంలో 8 గంటల నిద్ర తప్పక ఉండేలా అలవాట్లు మార్చుకోవాలని సూచించారు. అనునిత్యం వైద్య సలహాలు, వైద్య చికిత్సతో మందులు వాడాలన్నారు. వ్యాధి తగ్గిందని మందులు మానేయడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయని, గుండెపోటు, కిడ్నీ ఫెల్యూర్, పక్షవాతం వంటి వివిధ రకాల జబ్బుల బారిన పడాల్సి వస్తుందని, దీర్ఘకాలిక వైద్య పరీక్షలు అవసరమని తెలిపారు. దేశంలో 7 కోట్ల మంది మధుమేహం వ్యాధిగ్రస్తులు ఉన్నారని, ప్రీ డయాబెటిస్తో 14 కోట్ల మందికి పెరిగే అవకావశం ఉందని, వారిని ముందుగా గుర్తించి సరైన వైద్య పరీక్షలు చేయడం వల్ల కొంత తగ్గించే అవకాశం ఉందన్నారు.
ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ జీ దీప మాట్లాడుతూ, మధుమేహ బాధితులు దేశంలో వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆధునిక వైద్య విధానాలు, తాజా పరిశోధనలపై వైద్యులు నిరంతరం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. మధుమేహం ప్రస్తుతం ప్రజారోగ్య సమస్యగా మారిందని, ఐసీఎంఆర్ అధ్యయనాల ప్రకారం దేశంలో డయాబెటిస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యువతీయువకులు దీని బారిన పడుతున్నారని వివరించారు. ప్రతిమ మెడికల్ కళాశాల ఎండీ బోయినిపల్లి శ్రీనివాస్‌రావు ప్రోత్సాహం వల్లే సదస్సు విజయవంతమైందని తెలిపారు. సదస్సులో ప్రతిమ ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ డాక్టర్ పీఎల్ జాన్ ఇజ్రాయిల్, జిల్లా ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎం విజయమోహన్‌రెడ్డి, డాక్టర్ సీఎల్ ప్రసాద్, సీఈవో రాంచంద్రరావు, డాక్టర్లు రఘురామరెడ్డి, కుమార్, విఠల్, శ్రీదేవి, వీ లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, సంజయ్‌కుమార్‌తోపాటు రాష్ట్రంలోని వైద్య నిపుణులు, ఫ్రొఫెసర్లు, పీజీ, విద్యార్థులు, సుమారు 800 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.