రైతులు ఆగ్రహించారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. మొలకెత్తిన ధాన్యంతో పలుచోట్ల రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతోనే తాము నష్టపోవాల్సి వస్తున్నదని, సరైన సమయంలో కొనుగోలు చేస్తే ఇలా తడిసేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల రూరల్, మే 23 : జగిత్యాల అర్బన్ మండలంలోని గోపాల్రావుపేట ఐకేసీ సెంటర్లో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మొలకెత్తిన ధాన్యంతో ధర్మపురి జగిత్యాల ప్రధాన రహదారిపై శుక్రవారం ధర్నా చేశారు. సుమారు 40 నిమిషాలపాటు ఆందోళన చేయడంతో ఎకడి వాహనాలు అకడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అర్బన్ తహసీల్దార్ రామ్మోహన్, ఎస్ఐ సదాకర్ అక్కడికి చేరుకొని సర్ది చెప్పినా రైతులు ససేమిరా అనడంతో జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత ధర్నా వద్దకు చేరుకున్నారు. తడిసిన ధాన్యం ఆరబెట్టిన తర్వాత కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
రాయికల్, మే 23 : తడిసిన ధాన్యం వెంటనే కొనాలని రాయికల్ మండలం సింగారావుపేట- శ్రీరామ్‌నగర్ గ్రామాల రైతులు సింగర్రావుపేట- జగిత్యాల రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. అంతకు ముందు తడిచిన వడ్లను జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. రైతులు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న తహసీల్దార్ గణేశ్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు కొనుగోళ్లు త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే కొనాలని జగిత్యాల జడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం చేతికి అందేలోగా అకాల వర్షాలతో తడిసి ముద్దయిందని, అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోనే మొలకెత్తే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం రైతును రాజు చేస్తానని రోడ్డు పాలు చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ధాన్యం కొనాలని రైతులు రోడ్లపై ఎకడికకడ ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేసిందని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తు చేశారు. ధర్నాలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బరం మల్లేశ్ యాదవ్, నాయకులు చాంద్, రాజేశ్వర్ రెడ్డి, జలపతి రెడ్డి, గంగారెడ్డి, రాజమౌళి, చంద్రయ్య, శ్రీను, రవి, మల్లారెడ్డి, నరేష్, లక్ష్మణ్, రైతులు, మహిళలు పాల్గొన్నారు.