Dharmaram | ధర్మారం,జనవరి 11 : పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శీతల చెరువు సమీప గుట్టల్లో నిర్వహించే సమ్మక్క- సారలమ్మ జాతర ఉత్సవ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఈనెల 28 నుంచి 31 వరకు జాతర ఉత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ మేరకు గ్రామంలోని అన్ని కుల సంఘాల సభ్యులంతా సమ్మక్క- సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేకంగా సమావేశమైనారు. నూతన కమిటీ ఎన్నిక గురించి చర్చించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షుడిగా దాగేటి ఉదయ్ యాదవ్,అధ్యక్షుడు నార ప్రేమ్ సాగర్, ఉపాధ్యక్షుడిగా కల్వల రవి, కోశాధికారిగా తుమ్మల తిరుపతి యాదవ్ ని ఎన్నుకున్నారు.
గ్రామంలోని కుల సంఘాల వారు కమిటీ సభ్యులుగా ఉంటారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను స్థానికులు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద సన్మానించి అభినందించారు. త్వరలో మళ్లీ అన్ని కుల సంఘాలతో సమావేశమై జాతర ఉత్సవానికి భక్తుల కోసం ఏర్పాట్లు చేసే విషయంపై చర్చిస్తామని జాతర ఉత్స కమిటీ సభ్యులు తెలిపారు. కాగా ఈ సందర్భంగా జాతర ఉత్సవ నిర్వహణ కోసం దాతలు రూ.1,00,812 విరాళాలు ప్రకటించారు.
జాతర ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు దాగేటి ఉదయ్ యాదవ్ రూ.50,116, ధర్మారం ఉపసర్పంచ్ ఎలిగేటి మల్లేశం రూ.25,116, కమిటీ అధ్యక్షుడు నార ప్రేమ్ సాగర్, ఉపాధ్యక్షుడు కల్వల రవి, కోశాధికారి తుమ్మల తిరుపతి యాదవ్, ఏఎంసీ డైరెక్టర్ కాంపల్లి రాజేశం, వార్డు సభ్యుడు సోగాల తిరుపతి చెరో రూ.5,116 చొప్పున విరాళాలు ఇస్తున్నట్లు ప్రకటించగా కమిటీ వారు వారికి రసీదులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.